మార్కు 7:1-13

మార్కు 7:1-13 TCV

యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు యేసు చుట్టూ చేరారు. ఆయన శిష్యులలో కొందరు మురికి చేతులతో, అనగా చేతులు కడుక్కోకుండానే భోజనం చేస్తుండడం చూసారు. పెద్దల సాంప్రదాయం ప్రకారం, పరిసయ్యులు మరియు యూదులందరు తమ చేతులు కడుక్కోకుండా భోజనం చేయరు. వారు సంతవీధులలో నుండి వచ్చిన తర్వాత స్నానం చేయకుండా భోజనం చేయరు. ఇంకా గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను, భోజనబల్లను నీళ్ళతో కడగటం లాంటి అనేక ఆచారాలను వారు పాటిస్తారు. అందుకు పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, “నీ శిష్యులు ఎందుకు పెద్దల సాంప్రదాయాన్ని పాటించకుండా అపవిత్రమైన చేతులతో భోజనం చేస్తున్నారు?” అని యేసును అడిగారు. అందుకు ఆయన వారితో, వేషధారులారా, మీ గురించి యెషయా ప్రవచించింది నిజమే; అక్కడ వ్రాయబడి ఉన్నట్లు: “ ‘ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తారు కాని వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. వారు వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు; వారి బోధలు కేవలం మానవ నియమాలు మాత్రమే.’ మీరు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను పాటించడం విడిచిపెట్టి మానవ ఆచారాలకు కట్టుబడి ఉన్నారు” అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, “మీరు మీ స్వంత సంప్రదాయాలను పాటించడం కొరకు దేవుని ఆజ్ఞలను పూర్తిగా ప్రక్కకు పెట్టేస్తున్నారు! మోషే, ‘మీ తల్లిదండ్రులను గౌరవించాలి’ మరియు ‘ఎవరైనా తల్లిని గాని తండ్రిని గాని శపిస్తే, వారికి మరణశిక్ష విధించాలి’ అని ఆజ్ఞాపించాడు. కానీ మీరు, ఒక వ్యక్తి తన తల్లితో గాని తండ్రితో గాని నా వల్ల మీరు పొందదగిన సహాయమంతా కొర్బాన్ (అంటే దైవార్పితం) అని చెప్తే, వాడు తన తండ్రికి తల్లికి ఏమి చేయనక్కరలేదు అని చెప్తున్నారు. ఈ విధంగా మీరు నియమించుకొన్న మీ సాంప్రదాయం వలన దేవుని వాక్యాన్ని అర్థం లేనిదానిగా చేస్తున్నారు. ఇలాంటివి ఇంకా ఎన్నో మీరు చేస్తున్నారు” అని చెప్పారు.

మార్కు 7:1-13 కోసం వీడియో