మార్కు 15:40-47

మార్కు 15:40-47 TCV

కొందరు స్త్రీలు దూరం నుండి చూస్తున్నారు. వారిలో మగ్దలేనే మరియ, చిన్నవాడైన యాకోబు మరియు యోసేపుల తల్లియైన మరియ ఇంకా సలోమి ఉన్నారు. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి, ఆయనకు సేవ చేశారు, వీరే కాక ఆయన వెంట యెరూషలేముకు వచ్చిన అనేకమంది స్త్రీలు కూడ అక్కడ ఉన్నారు. అది సిద్ధపాటు రోజు అనగా సబ్బాతు దినానికి ముందు రోజు. కనుక సాయంకాలమైనప్పుడు, అరిమతయికు చెందిన యోసేపు న్యాయసభలో ప్రాముఖ్యమైన సభ్యుడు, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నవాడు, అతడు ధైర్యంగా పిలాతు దగ్గరకు వెళ్లి యేసు దేహాన్ని తనకు ఇమ్మని అడిగాడు. ఆయన అప్పటికే చనిపోయాడని విన్న పిలాతు ఆశ్చర్యపడ్డాడు. శతాధిపతిని తన దగ్గరకు పిలిచి, యేసు అప్పుడే చనిపోయాడా అని అడిగాడు. శతాధిపతి నుండి ఆ సంగతిని తెలుసుకున్నాక, యోసేపుకు యేసు శరీరాన్ని అప్పగించాడు. కనుక యోసేపు సన్నని నారబట్ట కొని తెచ్చి, యేసు శరీరాన్ని కిందికి దింపి, దానిని సన్నపు నారబట్టతో చుట్టి, రాతితో చెక్కబడిన సమాధిలో పెట్టాడు. తర్వాత ఆ సమాధి ద్వారం ముందు ఒక పెద్ద రాయి దొర్లించి దానిని మూసి వేసాడు. మగ్దలేనే మరియ, యోసేపు తల్లియైన మరియ ఆయనను పెట్టిన చోటును చూసారు.