తెల్లవారుజామున ముఖ్య యాజకులు, నాయకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు న్యాయసభ సభ్యులు అందరు కలిసి ఆలోచన చేశారు. కాబట్టి వారు యేసును బంధించి, తీసుకెళ్లి అధిపతియైన పిలాతు చేతికి అప్పగించారు.
పిలాతు యేసును, “నీవు యూదుల రాజువా?” అని అడిగాడు.
అందుకు యేసు, “అని నీవే అన్నావు” అని జవాబిచ్చారు.
ముఖ్య యాజకులు యేసు మీద అనేక నేరాలు మోపారు. అందుకు పిలాతు మళ్ళీ యేసుతో, “నీవు వారికి జవాబు చెప్పవా? వారు నీకు వ్యతిరేకంగా ఎన్ని నేరాలు మోపుతున్నారో చూడు!” అన్నాడు.
కాని యేసు జవాబివ్వలేదు, కాబట్టి పిలాతు ఆశ్చర్యపోయాడు.
పండుగ రోజు ప్రజల కోరిక మేరకు ఒక నేరస్థుని విడుదల చేయడం ఆనవాయితి. తిరుగుబాటు చేసి, మనుష్యులను చంపినందుకు బంధింపబడిన వారిలో బరబ్బా అనేవాడు ఉన్నాడు. ప్రజలు గుంపుగా వచ్చి, అతడు ఎప్పుడూ చేసినట్లే చేయమని పిలాతును కోరారు.
ముఖ్య యాజకులు కేవలం అసూయతోనే యేసును అప్పగించారని పిలాతుకు తెలుసు, కాబట్టి, “యూదుల రాజును విడుదల చేయమంటారా?” అని అడిగాడు. కాని ముఖ్య యాజకులు, యేసుకు బదులుగా బరబ్బాను విడుదల చేసేలా పిలాతును కోరమని గుంపును రెచ్చగొట్టారు.
అందుకు పిలాతు, “మరి, మీరు యూదుల రాజు అని పిలిచే ఇతన్ని ఏమి చేయమంటారు?” అని వారిని అడిగాడు.
అందుకు వారు, “సిలువ వేయండి!” అని అరిచారు.
“ఎందుకు? ఇతడు చేసిన నేరమేంటి?” అని పిలాతు అడిగాడు.
అయితే వారు ఇంకా గట్టిగా, “అతన్ని సిలువ వేయండి!” అని కేకలు వేశారు.
పిలాతు ఆ ప్రజలను సంతోషపెట్టడానికి, బరబ్బను వారికి విడుదల చేశాడు. యేసును కొరడాలతో కొట్టించి, సిలువ వేయడానికి అప్పగించాడు.
సైనికులు యేసును ప్రేతోర్యము అని పిలువబడే అధిపతి భవనం లోనికి తీసుకెళ్లి అక్కడ మిగిలిన సైనికులందరిని సమకూర్చారు. వారు ఆయనకు ఊదా రంగు అంగీని వేసి, ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తలమీద పెట్టారు. ఆ తర్వాత, “జయం, యూదుల రాజా!” అని ఆయనను పిలవడం మొదలుపెట్టారు. ఆయన తలపై కొమ్మతో పదే పదే కొడుతూ, ఆయన మీద ఉమ్మి వేశారు. వారు ఆయన ముందు మోకరించి, ఆయనను అవమానిస్తూ నమస్కరించారు. ఈ విధంగా ఆయనను ఎగతాళి చేసిన తర్వాత, ఆయన మీదనున్న ఊదా రంగు వస్త్రాన్ని తీసివేసి, ఆయన వస్త్రాలను ఆయనకే తొడిగించారు. తర్వాత ఆయనను సిలువ వేయడానికి తీసుకెళ్లారు.
కురేనీ ప్రాంతానికి చెందిన, అలెగ్జాండరు రూఫసు అనేవారి తండ్రియైన సీమోను ఆ మార్గాన వెళ్తున్నాడు. సైనికులు అతన్ని పట్టుకుని సిలువ మోయమని బలవంతం చేశారు. వారు యేసును గొల్గొతా అనే స్థలానికి తీసుకుని వచ్చారు. గొల్గొతా అంటే “కపాల స్థలం” అని అర్థము. అప్పుడు వారు బోళం కలిపిన ద్రాక్షరసాన్ని ఆయనకు ఇచ్చారు, కాని ఆయన దానిని తీసుకోలేదు. ఆ తర్వాత వారు ఆయనను సిలువ వేశారు. ఆయన వస్త్రాలను పంచుకోడానికి, వారు చీట్లు వేసి ఎవరికి వచ్చింది వారు తీసుకున్నారు.
ఆయనను సిలువ వేసినప్పుడు సమయం ఉదయం తొమ్మిది గంటలు అయ్యింది. ఆయనపై ఉన్న నేరం యొక్క వ్రాతపూర్వక ఉత్తర్వు ఇలా ఉంది:
యూదుల రాజు.