మార్కు సువార్త 14:3-11

మార్కు సువార్త 14:3-11 TSA

యేసు బేతనియలో, కుష్ఠరోగియైన సీమోను ఇంట్లో భోజనపు బల్ల దగ్గర కూర్చున్నప్పుడు, ఒక స్త్రీ చాలా విలువైన పరిమళద్రవ్యం ఉన్న ఒక పాలరాతి సీసాను తెచ్చి, ఆ సీసాను పగులగొట్టి ఆ పరిమళద్రవ్యాన్ని యేసు తలమీద పోసింది. అక్కడ ఉన్న కొందరు కోప్పడి, “పరిమళద్రవ్యాన్ని ఇలా ఎందుకు వృధా చేయడం? అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు. ఈ పరిమళద్రవ్యాన్ని మూడువందల దేనారాలకు అమ్మి ఆ డబ్బును పేదవారికి ఇచ్చి ఉండాల్సింది” అని ఆ స్త్రీని కోపంగా గద్దించారు. అందుకు యేసు, “ఆమెను ఒంటరిగా వదిలేయండి, ఆమెను ఎందుకు తొందర పెడుతున్నారు? ఆమె నా కోసం ఒక కార్యం చేసింది. పేదలు ఎల్లప్పుడు మీతోనే ఉంటారు, మీకు ఇష్టం వచ్చిన సమయంలో మీరు వారికి సహాయం చేయవచ్చు. కాని నేను మీతో ఉండను. ఆమె చేయగలిగింది ఆమె చేసింది. నా భూస్థాపన కోసం నన్ను సిద్ధం చేయడానికి ఆమె ముందుగానే పరిమళద్రవ్యాన్ని నా శరీరం మీద పోసింది. సర్వలోకంలో ఎక్కడ సువార్త ప్రకటించబడినా, అక్కడ ఈమె చేసింది జ్ఞాపకం చేసుకుని, ఈమె చేసిన దాని గురించి కూడా చెప్పుకుంటారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను” అని వారితో అన్నారు. పన్నెండుమందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా, ముఖ్య యాజకుల చేతికి యేసును అప్పగించడానికి వారి దగ్గరకు వెళ్లాడు. ఇది విని వారు సంతోషించి వానికి డబ్బులు ఇస్తామని వాగ్దానం చేశారు. కాబట్టి వాడు యేసును అప్పగించడానికి తగిన అవకాశం కోసం ఎదురుచూశాడు.