మార్కు సువార్త 13:24-37

మార్కు సువార్త 13:24-37 TSA

“కాని ఆ దినాల్లో, ఆ శ్రమకాలం తర్వాత, “ ‘సూర్యుడు నల్లగా మారుతాడు, చంద్రుడు తన కాంతిని కోల్పోతాడు. ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతాయి, ఆకాశ సంబంధమైనవి చెదిరిపోతాయి.’ “అప్పుడు మనుష్యకుమారుడు గొప్ప శక్తితో మహిమతో మేఘాల మీద రావడం ప్రజలు చూస్తారు. ఆయన తన దూతలను పంపి, నలుదిక్కుల నుండి, భూమి అంతం నుండి ఆకాశ అంతం వరకు తాను ఏర్పరచుకున్న వారిని పోగుచేస్తారు. “అంజూర చెట్టును చూసి ఒక పాఠం నేర్చుకోండి: అంజూర కొమ్మలు లేతవై చిగురిస్తున్నప్పుడు, వేసవికాలం సమీపంగా ఉందని మీకు తెలుస్తుంది. అలాగే, ఈ సంగతులన్ని జరుగుతున్నాయని మీరు చూసినప్పుడు, ఆయన రాకడ చాలా దగ్గరలో ఉందని, తలుపు దగ్గరే ఉందని మీరు తెలుసుకోండి. ఇవన్నీ జరిగే వరకు ఈ తరం గతించదని ఖచ్చితంగా మీతో చెప్తున్నాను. ఆకాశం భూమి గతించిపోతాయి, గాని నా మాటలు ఏమాత్రం గతించవు. “అయితే ఆ దినం గురించి, ఆ సమయం గురించి ఎవరికి తెలియదు, కనీసం పరలోకంలోని దూతలకు గాని, తన కుమారునికి గాని తెలియదు. కేవలం తండ్రికి మాత్రమే తెలుసు. జాగ్రత్తగా ఉండండి! మెలకువగా ఉండండి! ఆ సమయం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. అది తన ఇల్లు విడిచి దూరదేశం వెళ్తున్న ఒక మనిషిని పోలి ఉంది: అతడు సేవకులకు అధికారం ఇచ్చి, ప్రతీ సేవకునికి వారి వారి పనులను అప్పగించి, ద్వారం దగ్గర ఉన్నవానికి కాపలా కాయమని చెప్తాడు. “ఇంటి యజమాని సాయంత్రం వస్తాడో, మధ్యరాత్రి వస్తాడో, కోడి కూసే వేళకు వస్తాడో, లేదా సూర్యోదయం వేళకు వస్తాడో, ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు కాబట్టి మెలకువగా ఉండండి. అతడు ఒకవేళ అకస్మాత్తుగా వస్తే, మీరు నిద్రపోవడం చూస్తాడేమో అని జాగ్రత్తగా ఉండండి! నేను మీతో చెప్తుందే అందరితో చెప్తున్న: ‘మెలకువగా ఉండండి!’ ”

మార్కు సువార్త 13:24-37 కోసం వీడియో