ప్రజలు తమ చిన్నపిల్లలపై యేసు తన చేతులుంచి వారిని ఆశీర్వదించాలని ఆయన దగ్గరకు తీసుకుని వస్తున్నారు, కాని శిష్యులు వారిని గద్దించారు. యేసు అది చూసి, శిష్యుల మీద కోప్పడ్డారు. ఆయన వారితో, “చిన్న పిల్లలను నా దగ్గరకు రానివ్వండి, వారిని ఆటంకపరచకండి, ఎందుకంటే ఇలాంటి వారిదే దేవుని రాజ్యము. ఎవరైనా చిన్నపిల్లల్లా దేవుని రాజ్యాన్ని స్వీకరించకపోతే ఎన్నటికి దానిలో ప్రవేశించరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అని అన్నారు. అప్పుడు ఆయన ఆ పిల్లలను తన కౌగిటిలో ఎత్తుకుని, వారి మీద తన చేతులుంచి వారిని దీవించారు.
యేసు బయలుదేరి వెళ్తునప్పుడు, ఒక మనిషి ఆయన దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి ఆయన ముందు మోకాళ్లూని, “మంచి బోధకుడా, నిత్యజీవం పొందుకోవాలంటే నేనేమి చేయాలి?” అని అడిగాడు.
అందుకు యేసు, “నీవు నన్ను ఎందుకు మంచివాడనని పిలుస్తున్నావు? దేవుడు తప్ప మంచివారు ఎవ్వరూ లేరు. మీకు ఆజ్ఞలు తెలుసు: ‘హత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధసాక్ష్యం చెప్పకూడదు, మోసం చేయకూడదు, మీ తండ్రిని తల్లిని గౌరవించాలి’ ” అని అన్నారు.
అందుకు అతడు, “బోధకుడా, నేను నా బాల్యం నుండే వీటన్నిటిని ఆచరిస్తున్నాను” అన్నాడు.
యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, “నీలో ఒక కొరత ఉంది. నీవు వెళ్లి, నీకున్న ఆస్తి అంతా అమ్మి పేదవారికి పంచిపెట్టు, అప్పుడు పరలోకంలో నీవు ధనం కలిగి ఉంటావు. తర్వాత వచ్చి, నన్ను వెంబడించు” అని చెప్పారు.
ఆ మాటతో అతడు ముఖం చిన్నబుచ్చుకుని, విచారంగా వెళ్లిపోయాడు, ఎందుకంటే అతడు గొప్ప ఆస్తి కలవాడు.
యేసు చుట్టూ చూసి తన శిష్యులతో, “ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంత కష్టమో!” అన్నారు.
ఆయన మాటలకు శిష్యులు ఆశ్చర్యపడ్డారు కాని యేసు మళ్ళీ, “పిల్లలారా, దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంత కష్టమో! ఒక ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది రంధ్రం గుండా దూరడం సులభం” అని చెప్పారు.
ఇది విని శిష్యులు మరింత ఆశ్చర్యపడి, ఒకరితో ఒకరు, “అయితే మరి ఎవరు రక్షణ పొందగలరు?” అనుకున్నారు.
యేసు వారివైపు చూసి, “ఇది మనుష్యులకు అసాధ్యమే, కాని దేవునికి కాదు; దేవునికి సమస్తం సాధ్యమే!” అన్నారు.
అప్పుడు పేతురు, “మేము అన్నిటిని విడిచిపెట్టి నిన్ను వెంబడించాము!” అన్నాడు.
అందుకు యేసు, “నేను మీతో నిజంగా చెప్తున్నాను, నా కోసం సువార్త కోసం ఎవరైతే తమ ఇంటిని, సహోదరులను, సహోదరీలను, తల్లిని, తండ్రిని, పిల్లలను, పొలాలను విడిచిపెడతారో, వారు హింసతో పాటు ఇండ్లను, సహోదరులను, సహోదరీలను, తల్లులను, పిల్లలను, పొలాలను ఈ ప్రస్తుత యుగంలో రానున్న యుగంలో నిత్యజీవాన్ని వందరెట్లు పొందుకొంటారు. అయితే చాలామంది మొదటివారు చివరివారవుతారు, చివరి వారు మొదటివారవుతారు” అని చెప్పారు.