కాని నేను చెప్పేదేంటంటే, తన సహోదరుని మీద కాని సహోదరి మీద కాని కోప్పడేవారు తీర్పుకు గురవుతారు. అంతేకాక తన సహోదరుని కాని సహోదరిని కాని చూసి ద్రోహి అని పలికేవారు న్యాయస్థానం ఎదుట నిలబడాలి. ‘వెర్రివాడ లేదా వెర్రిదాన!’ అనే వారికి నరకాగ్నికి తప్పదు. “కాబట్టి మీరు బలిపీఠం దగ్గర కానుకను అర్పిస్తూ ఉండగా మీ సహోదరునికైనా సహోదరికైనా మీమీద ఏదైన విరోధం ఉందని జ్ఞాపకం వస్తే, మీ కానుకను అక్కడ బలిపీఠం ముందే పెట్టి, మొదట వెళ్లి మీ సహోదరునితో లేక సహోదరితో సమాధానపడి ఆ తర్వాత వచ్చి మీ కానుకను అర్పించాలి. “మీలో ఎవరైనా మీ విరోధితో నీకున్న వివాదం విషయంలో మీరిద్దరు న్యాయస్థానానికి వెళ్తున్నట్లయితే ఇంకా దారిలో ఉండగానే సమాధానపడడం మంచిది. లేకపోతే మీ విరోధి మిమ్మల్ని న్యాయాధిపతికి అప్పగించవచ్చు, ఆ న్యాయాధిపతి మిమ్మల్ని అధికారికి అప్పగించి చెరసాలలో వేయించవచ్చు. అప్పుడు జరిగేదేంటంటే చివరి పైసా చెల్లించే వరకు మీరు బయట పడలేరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. “ ‘వ్యభిచారం చేయకూడదు’ అని చెప్పిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పేదేంటంటే, ఒక వ్యక్తి స్త్రీని కామంతో చూస్తేనే అతడు తన మనస్సులో ఆమెతో వ్యభిచారం చేసినట్టు. మీరు పొరపాట్లు చేయడానికి ఒకవేళ మీ కుడికన్ను కారణమైతే, దాన్ని పెరికి పారవేయడం మేలు. ఎందుకంటే మీ శరీరమంతా నరకంలో పడవేయబడటం కంటే, మీ శరీరంలో ఒక అవయవాన్ని పోగొట్టుకోవడం మీకు మేలు కదా. మీరు పొరపాట్లు చేయడానికి ఒకవేళ మీ కుడి చేయి కారణమైతే దాన్ని నరికి పారవేయండి. ఎందుకంటే మీ శరీరమంతా నరకంలో పడవేయబడటం కంటే మీ శరీరంలో ఒక అవయవాన్ని పోగొట్టుకోవడం మీకు మేలు కదా. “ ‘తన భార్యను విడిచిపెట్టేవాడు ఆమెకు ధృవీకరణ పత్రం వ్రాసివ్వాలి’ అని చెప్పబడింది. కానీ నేను మీతో చెప్పేదేంటంటే, ఒక్క వ్యభిచార విషయంలో తప్ప తన భార్యను విడిచిపెట్టేవాడు ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నట్టే. విడిచిపెట్టబడిన స్త్రీని పెళ్ళి చేసుకునేవాడు ఆమెతో వ్యభిచారం చేస్తున్నట్టే. “అంతేగాక, ‘మీరు మాట ఇస్తే తప్పకూడదు. చేసిన ప్రమాణాలను ప్రభువును బట్టి నిలబెట్టుకోవాలి’ అని పూర్వికులతో చెప్పిన మాట మీరు విన్నారు. అయితే నేను మీతో చెప్పేదేంటంటే, అసలు మీరు ఒట్టు పెట్టుకోవద్దు: ఆకాశంతోడని అనవద్దు, ఎందుకంటే ఆకాశం దేవుని సింహాసనం; భూమి తోడని అనవద్దు, ఎందుకంటే భూమి ఆయన పాదపీఠం; యెరూషలేము తోడని అనవద్దు, ఎందుకంటే యెరూషలేము మహారాజు పట్టణం. మీ తలమీద ప్రమాణం చేయవద్దు, ఎందుకంటే మీరు కనీసం ఒక్క వెంట్రుకనైనా తెల్లగా కాని నల్లగా కాని చేయలేరు కదా. మీరు కేవలం ‘అవునంటే అవును కాదంటే కాదు’ అని చెప్పాలి; దీనికి మించి ఏమి చెప్పినా అది దుష్టుని నుండి వచ్చినట్టే. “ ‘కంటికి కన్ను, పంటికి పన్ను’ అని చెప్పిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పేదేంటంటే, దుష్టుని ఎదిరించకూడదు, ఎవరైనా మిమ్మల్ని కుడిచెంప మీద కొడితే, వారికి మీ మరో చెంపను చూపించాలి. ఎవరైనా మీతో వివాదం పెట్టుకోవాలని మీ అంగీ తీసుకుంటే, వారికి మీ పైవస్త్రాన్ని కూడా ఇవ్వండి. ఎవరైనా ఒక మైలు దూరం రమ్మని మిమ్మల్ని బలవంతం చేస్తే వారితో మీరు రెండు మైళ్ళు వెళ్లండి. ఎవరైనా మిమ్మల్ని అడిగేవారికి ఇవ్వండి. మిమ్మల్ని అప్పు అడగాలనుకున్న వారి నుండి మీరు తప్పించుకోవద్దు.
చదువండి మత్తయి సువార్త 5
వినండి మత్తయి సువార్త 5
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: మత్తయి సువార్త 5:22-42
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు