మత్తయి 5:1-16

మత్తయి 5:1-16 TCV

ఒక రోజు యేసు జనసమూహాన్ని చూసి, కొండ మీదికి వెళ్లి కూర్చున్నారు, ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు. అప్పుడు ఆయన వారికి బోధించడం మొదలుపెట్టారు. ఆయన అన్నారు: “ఆత్మ కొరకు దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. దుఃఖించే వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపొందుతారు. కనికరం చూపేవారు ధన్యులు, వారు కనికరం పొందుకొంటారు. హృదయశుధ్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. సమాధానపరచేవారు ధన్యులు, వారు దేవుని బిడ్డలుగా పిలువబడతారు. నీతికొరకు హింసల పాలయ్యేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. “నా నిమిత్తం ప్రజలు మిమ్మల్ని అవమానించి, హింసించి మీరు చెడ్డవారని అబద్ధ సాక్ష్యం చెప్పినప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి, ఎందుకంటే పరలోకంలో మీ బహుమానం గొప్పది, మీకన్నా ముందు వచ్చిన ప్రవక్తలను కూడా వారు ఇలాగే హింసించారు. “మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. కాని ఉప్పు తన సారం కోల్పోతే, అది తిరిగి సారవంతంగా ఎలా చేయబడుతుంది? అది బయట పడవేయబడి పాదాల క్రింద త్రొక్కబడడానికే తప్ప మరి దేనికి పనికిరాదు. “మీరు లోకానికి వెలుగై ఉన్నారు. కొండ మీద కట్టబడిన పట్టణం కనబడకుండ ఉండలేదు. అదే విధంగా, ఎవ్వరూ దీపాన్ని వెలిగించి దానిని పాత్ర క్రింద పెట్టరు, కాని దానిని దీపస్తంభం మీద పెడతారు, అప్పుడది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి వెలుగు ఇస్తుంది. అదే విధంగా, ఇతరులు మీ మంచి పనులను చూసి పరలోకమందు ఉన్న మీ తండ్రిని మహిమపరిచేలా, ఇతరుల ముందు మీ వెలుగును ప్రకాశింపనివ్వండి.