మత్తయి సువార్త 27:15-31
మత్తయి సువార్త 27:15-31 TSA
పండుగ రోజు ప్రజల ఎన్నుకున్న ఒక నేరస్థుని విడుదల చేయడం అధిపతికి ఆనవాయితి. ఆ సమయంలో బందిపోటు దొంగగా పేరుమోసిన బరబ్బ అనే ఖైదీ ఉన్నాడు. కాబట్టి జనసమూహం సమకూడినప్పుడు, పిలాతు, “నేను ఎవరిని విడుదల చేయాలని మీరు కోరుతున్నారు? యేసు అనబడిన బరబ్బనా లేదా క్రీస్తు అనబడిన యేసునా?” అని వారిని అడిగాడు. ఎందుకంటే వారు కేవలం అసూయతోనే యేసును అప్పగించారని అతడు గ్రహించాడు. పిలాతు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు, అతని భార్య అతనికి: “నీవు ఆ నిర్దోషి జోలికి పోవద్దు, రాత్రి కలలో ఆయన గురించి నేను చాలా కష్టపడ్డాను” అని వర్తమానం పంపింది. కాని ముఖ్య యాజకులు నాయకులు బరబ్బాను విడుదల చేసి యేసును చంపమని అడిగేలా ప్రజలను రెచ్చగొట్టారు. అధిపతి, “ఈ ఇద్దరిలో నేను ఎవనిని విడుదల చేయాలని మీరు కోరుతున్నారు?” అని వారిని అడిగాడు. వారు, “బరబ్బనే” అని కేకలు వేశారు. అందుకు పిలాతు, “అలాగైతే క్రీస్తు అనబడిన యేసును, ఏమి చేయాలి?” అని వారిని అడిగాడు. అందుకు వారు, “సిలువ వేయండి!” అని కేకలు వేశారు. “ఎందుకు? ఇతడు చేసిన నేరమేంటి?” అని పిలాతు అడిగాడు. అయితే వారు ఇంకా గట్టిగా, “అతన్ని సిలువ వేయండి!” అని కేకలు వేశారు. పిలాతు అల్లరి ఎక్కువ అవుతుంది తప్ప తాను ఏమి చేయలేకపోతున్నానని గ్రహించి, నీళ్లు తీసుకుని ప్రజలందరి ముందు తన చేతులను కడుక్కుని, “ఈయన రక్తం విషయంలో నేను నిర్దోషిని, ఇక మీదే బాధ్యత!” అని చెప్పాడు. అప్పుడు ప్రజలందరు, “ఇతని రక్తం మామీద మా పిల్లల మీద ఉండును గాక!” అని కేకలు వేశారు. అప్పుడు పిలాతు బరబ్బను వారికి విడుదల చేశాడు. యేసును కొరడాలతో కొట్టించి, సిలువ వేయడానికి అప్పగించాడు. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధిపతి భవనం లోనికి తీసుకెళ్లి, సైనికులందరిని యేసు చుట్టూ సమకూర్చారు. వారు ఆయన బట్టలను తీసివేసి ఆయనకు ఎర్రని అంగీని తొడిగించారు. ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తలమీద పెట్టారు. ఒక కర్ర తన కుడిచేతిలో ఉంచారు. అప్పుడు ఆయన ఎదుట మోకరించి, “యూదుల రాజా, నీకు శుభం!” అని అంటూ ఆయనను ఎగతాళి చేశారు. వారు ఆయన మీద ఉమ్మివేసి, కర్ర తీసుకుని దానితో ఆయనను తలమీద పదే పదే కొట్టారు. వారు ఆయనను ఎగతాళి చేసిన తర్వాత, ఆయన మీదున్న అంగీని తీసివేసి ఆయన వస్త్రాలను ఆయనకే తొడిగించారు. ఆ తర్వాత ఆయనను సిలువ వేయడానికి తీసుకెళ్లారు.


