మత్తయి సువార్త 26:7-30

మత్తయి సువార్త 26:7-30 TSA

ఒక స్త్రీ చాలా ఖరీదైన పరిమళద్రవ్యం ఉన్న ఒక పాలరాతి సీసాను తెచ్చి, ఆయన భోజనపు బల్ల దగ్గర కూర్చున్నప్పుడు ఆయన తలమీద ఆ పరిమళద్రవ్యంను పోసింది. శిష్యులు అది చూసి కోప్పడి, “ఇలా ఎందుకు వృధా చేయడం?” అని అడిగారు. వారు, “ఈ పరిమళద్రవ్యాన్ని ఎక్కువ వెలకు అమ్మి ఆ డబ్బు పేదవారికి ఇచ్చి ఉండాల్సింది” అన్నారు. యేసు ఆ సంగతి గ్రహించి వారితో, “ఈ స్త్రీని ఎందుకు తొందర పెడుతున్నారు? ఈమె నా కోసం ఒక మంచి కార్యం చేసింది. పేదలు ఎల్లప్పుడు మీతోనే ఉంటారు, కాని నేను మీతో ఉండను. ఈమె ఈ పరిమళద్రవ్యంను నా శరీరం మీద పోసి, నా భూస్థాపన కోసం నన్ను సిద్ధం చేసింది. సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడినా, అక్కడ ఈమె చేసింది జ్ఞాపకం చేసుకుని, ఈమె చేసిన దాని గురించి కూడా చెప్పుకుంటారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను” అని వారితో అన్నారు. అప్పుడు పన్నెండుమందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా, ముఖ్య యాజకుల దగ్గరకు వెళ్లి, “నేను యేసును మీకు పట్టించడానికి నాకు ఏమి ఇస్తారు?” అని వారిని అడిగాడు. అందుకు వారు ముప్పై వెండి నాణాలు లెక్కపెట్టి వానికి ఇచ్చారు. వాడు అప్పటినుండి ఆయనను అప్పగించడానికి తగిన అవకాశం కోసం ఎదురుచూశాడు. పులియని రొట్టెల పండుగ మొదటి రోజున, శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, “నీకోసం పస్కా భోజనం సిద్ధం చేయడానికి మమ్మల్ని ఎక్కడికి వెళ్లమంటావు?” అని అడిగారు. అందుకు యేసు, “మీరు పట్టణంలో ఫలాన వ్యక్తి దగ్గరకు వెళ్లి, అతనితో, బోధకుడు ఇలా అన్నాడు: నా సమయం దగ్గరకు వచ్చింది. నేను నా శిష్యులతో కలిసి నీ ఇంట్లో పస్కాను ఆచరిస్తాను అని చెప్పమన్నాడు అని చెప్పండి” అన్నారు. శిష్యులు వెళ్లి యేసు తమకు ఆదేశించిన ప్రకారం చేసి పస్కాను సిద్ధం చేశారు. సాయంకాలమైనప్పుడు, ఆయన పన్నెండుమంది శిష్యులతో కలిసి భోజనానికి కూర్చున్నారు. వారు భోజనం చేస్తూ ఉండగా, ఆయన వారితో, “మీతో ఖచ్చితంగా చెప్తున్నాను, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు” అని అన్నారు. అందుకు వారు చాలా దుఃఖపడి, “ప్రభువా, నేనైతే కాదు కదా?” అని ఒకరి తర్వాత ఒకరు ఆయనను అడగడం మొదలుపెట్టారు. అందుకు యేసు, “నాతో పాటు గిన్నెలో చేయి ముంచిన వాడే నన్ను అప్పగిస్తాడు. మనుష్యకుమారుని గురించి వ్రాయబడి ఉన్న ప్రకారం ఆయన వెళ్లిపోతారు. కాని మనుష్యకుమారుని పట్టించే వానికి శ్రమ! ఆ వ్యక్తి అసలు పుట్టి ఉండకపోతే అతనికి మేలు” అని అన్నారు. అప్పుడు ఆయనను అప్పగించబోయే యూదా, “బోధకుడా, నేనైతే కాదు కదా?” అని అడిగాడు. అందుకు యేసు, “అలా నీవే చెప్పావు” అని జవాబిచ్చారు. వారు భోజనం చేస్తున్నప్పుడు, యేసు ఒక రొట్టెను పట్టుకుని, దాని కోసం కృతజ్ఞతలు చెల్లించి, దానిని విరిచి తన శిష్యులకు ఇస్తూ, “దీనిని తీసుకుని తినండి; ఇది నా శరీరం” అని చెప్పారు. తర్వాత ఆయన పాత్రను తీసుకుని, కృతజ్ఞతలు చెల్లించి వారికి ఇచ్చి, “దీనిలోనిది మీరందరు త్రాగండి. ఇది అనేకుల పాపక్షమాపణ కోసం నేను చిందించనున్న నా నిబంధన రక్తము. నేను మీతో చెప్పేదేమనగా, నా తండ్రి రాజ్యంలో మీతో కూడ నేను ఈ ద్రాక్షరసం క్రొత్తదిగా త్రాగే రోజు వరకు మళ్ళీ దీనిని త్రాగను.” వారు ఒక కీర్తన పాడిన తర్వాత, ఒలీవల కొండకు వెళ్లారు.