మత్తయి 26:20-54

మత్తయి 26:20-54 TCV

సాయంకాలమైనప్పుడు, ఆయన పన్నెండు మంది శిష్యులతో కలిసి భోజనానికి కూర్చున్నారు. వారు భోజనం చేస్తూవుండగా, ఆయన వారితో, “మీతో ఖచ్చితంగా చెప్తున్నాను, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు” అని అన్నారు. అందుకు వారు చాలా దుఃఖపడి, “ప్రభువా, నేనైతే కాదు కదా?” అని ఒకరి తర్వాత ఒకరు ఆయనను అడగడం మొదలుపెట్టారు. అందుకు యేసు, “నాతో పాటు గిన్నెలో చెయ్యి ముంచిన వాడే నన్ను అప్పగిస్తాడు. మనుష్యకుమారుని గురించి వ్రాయబడి ఉన్న ప్రకారం ఆయన వెళ్లిపోతారు. కాని మనుష్యకుమారుని పట్టించే వానికి శ్రమ! ఆ వ్యక్తి అసలు పుట్టి ఉండకపోతే అతనికి మేలు” అని అన్నారు. అప్పుడు ఆయనను అప్పగించబోయే యూదా, “బోధకుడా, నేనైతే కాదు కదా?” అని అడిగాడు. అందుకు యేసు, “అలా నీవే చెప్పావు” అని జవాబిచ్చారు. వారు భోజనం చేస్తున్నప్పుడు, యేసు ఒక రొట్టెను పట్టుకొని, దాని కొరకు కృతజ్ఞతలు చెల్లించి, దానిని విరిచి తన శిష్యులకు ఇస్తూ, “దీనిని తీసికొని తినండి; ఇది నా శరీరం” అని చెప్పారు. తర్వాత ఆయన పాత్రను తీసుకొని, కృతజ్ఞతలు చెల్లించి వారికి ఇచ్చి, “దీనిలోనిది మీరందరు త్రాగండి. ఇది అనేకుల పాపక్షమాపణ కొరకు నేను చిందించనున్న నా నిబంధన రక్తం. నేను మీతో చెప్పేదేమనగా, నా తండ్రి రాజ్యంలో మీతో కూడ నేను ఈ ద్రాక్షరసం క్రొత్తదిగా త్రాగే రోజు వరకు మళ్ళీ దీనిని త్రాగను.” వారు ఒక కీర్తన పాడిన తర్వాత, ఒలీవల కొండకు వెళ్లారు. అప్పుడు యేసు వారితో, “నన్ను బట్టి ఈ రాత్రి మీరందరు చెదరిపోతారు ఎందుకంటే ఇలా వ్రాయబడి ఉంది: “ ‘నేను గొర్రెల కాపరిని కొడతాను, అప్పుడు మందలోని గొర్రెలు చెదరిపోతాయి.’ కాని నేను తిరిగి లేచిన తర్వాత, మీకంటే ముందు గలిలయకు వెళ్తాను” అన్నారు. అందుకు పేతురు, “అందరు నిన్ను విడిచి వెళ్లిపోయినా, నేను నిన్ను విడువను” అన్నాడు. అందుకు యేసు అతనితో, “ఈ రాత్రి కోడి కూయక ముందే, నేను నీకు తెలియదని మూడుసార్లు చెప్తావు అని నీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అన్నారు. కాని పేతురు యేసుతో, “నేను నీతో కలిసి చావాల్సి వచ్చినా, నీవెవరో నాకు తెలియదని చెప్పను” అన్నాడు. మిగిలిన శిష్యులందరు కూడా అలాగే అన్నారు. ఆ తర్వాత యేసు తన శిష్యులతో కూడ గెత్సేమనే అనే చోటికి వెళ్లారు, ఆయన వారితో, “నేను అక్కడికి వెళ్లి ప్రార్థన చేసి వచ్చేవరకు మీరు ఇక్కడే కూర్చోండి” అని చెప్పారు. ఆయన పేతురును, జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి, దుఃఖపడుతూ బాధపడసాగారు. ఆయన వారితో, “నేను చనిపోయే అంతగా నా ప్రాణం దుఃఖంలో నిండిపోయింది, కనుక మీరు ఇక్కడే ఉండి నాతో కలిసి మెలకువగా ఉండండి” అని చెప్పారు. కొంత దూరం వెళ్లి, సాగిలపడి, “నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నెను నా దగ్గర నుండి తొలగిపోనివ్వు. అయినా నా చిత్తప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే జరిగించు” అని ప్రార్థించారు. యేసు తిరిగి తన శిష్యుల దగ్గరకు వచ్చి, వారు నిద్రిస్తున్నారని చూసి పేతురుతో, “ఒక గంటయైనా నాతో మెలకువగా ఉండలేరా?” అని అడిగి, “మీరు శోధనలో పడకుండ ఉండేలా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే, కాని శరీరం బలహీనం” అని చెప్పారు. ఆయన రెండవ సారి వెళ్లి ప్రార్థించారు, “నా తండ్రీ, నేను దీనిని త్రాగితేనే తప్ప ఇది నా దగ్గరి నుండి తొలగిపోవడం సాధ్యం కానట్లైతే, నీ చిత్తమే నెరవేర్చు.” ఆయన తిరిగి వచ్చినప్పుడు, వారి కళ్ళు బరువుగా ఉన్నాయి, కనుక వారు మళ్ళీ నిద్రపోతున్నారని గమనించారు. కనుక ఆయన మరొకసారి వారిని విడిచివెళ్లి, ఆ మాటలనే పలుకుతు మూడవసారి ప్రార్థించారు. అప్పుడు ఆయన తన శిష్యుల దగ్గరకు తిరిగి వచ్చి, “మీరు ఇంకా నిద్రిస్తు విశ్రాంతి తీసుకొంటున్నారా? చూడండి, మనుష్యకుమారుడు పాపుల చేతికి అప్పగించబడే సమయం వచ్చేసింది. లేవండి! మనం వెళ్దాం. నన్ను పట్టించేవాడు వస్తున్నాడు” అని చెప్పారు. ఆయన ఇంకా మాట్లాడుతుండగా, పన్నెండుగురిలో ఒకడైన, యూదా వచ్చాడు. అతనితో పాటు ముఖ్య యాజకులు మరియు ప్రజానాయకుల వద్దనుంచి పంపబడిన పెద్ద గుంపు కత్తులు కర్రలు పట్టుకొని వచ్చింది. ఆయనను పట్టించేవాడు వారికి గుర్తులు చెప్పాడు, “నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో; ఆయనను మీరు బంధించాలి” యూదా వెంటనే యేసు దగ్గరకు వెళ్లి, “బోధకుడా, నీకు శుభం” అంటూ ఆయనను ముద్దు పెట్టుకున్నాడు. అందుకు యేసు, “స్నేహితుడా, ఏమి చేయడానికి వచ్చావో అది చెయ్యి” అన్నారు. అప్పుడు వారు ముందుకు వచ్చి, యేసును అడ్డుకుని, ఆయనను బంధించారు. అంతలో, యేసుతో కూడ ఉన్నవారిలో ఒకడు తన కత్తిని దూసి ప్రధాన యాజకుని సేవకుడిని కొట్టి, వాని చెవిని నరికివేసాడు. యేసు వానితో, “నీ కత్తిని వరలో తిరిగిపెట్టు, ఎందుకంటే కత్తి ఉపయోగించేవాడు కత్తితోనే చస్తాడు. ఇప్పుడు నేను నా తండ్రిని వేడుకొంటే, ఆయన పన్నెండు దళాల సైన్యం కంటే ఎక్కువ మంది దూతలను వెంటనే నాకు పంపడని అనుకున్నావా? కాని, ఈ విధంగా జరగాలని లేఖనాలలో చెప్పబడినవి ఎలా నెరవేరుతాయి?” అని అన్నారు.