యేసు ఈ మాటలను చెప్పి ముగించిన తర్వాత, ఆయన తన శిష్యులతో, “మీకు తెలిసినట్లు, పస్కాకు ఇంకా రెండు రోజులున్నాయి, అప్పుడు మనుష్యకుమారుడు సిలువ వేయబడడానికి అప్పగించబడతాడు” అని చెప్పారు. అప్పుడు ముఖ్య యాజకులు, ప్రజానాయకులు కలిసి కయప అనబడే ప్రధాన యాజకుని నివాసంలో సమావేశమయ్యారు. వారు యేసును రహస్యంగా పట్టుకొని, చంపాలి అని కుట్ర పన్నారు. కాని పండుగ సమయంలో వద్దు “జనాల మధ్య అల్లరి కలుగుతుందేమో” అని చెప్పుకున్నారు. యేసు బేతనియ గ్రామంలో కుష్ఠరోగియైన సీమోను ఇంట్లో ఉన్నప్పుడు, ఒక స్త్రీ చాలా ఖరీదైన పరిమళద్రవ్యం ఉన్న ఒక పాలరాతి సీసాను తెచ్చి, ఆయన భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు ఆయన తల మీద ఆ పరిమళద్రవ్యంను పోసింది. శిష్యులు అది చూసి కోపపడి, “ఇలా ఎందుకు వృధా చేయడం?” అని అడిగారు. వారు, “ఈ పరిమళద్రవ్యాన్ని ఎక్కువ వెలకు అమ్మి ఆ డబ్బు పేదవారికి ఇచ్చి ఉండాల్సింది” అన్నారు. యేసు ఆ సంగతి గ్రహించి వారితో, “ఈ స్త్రీని ఎందుకు తొందర పెడుతున్నారు? ఈమె నా కొరకు ఒక మంచి కార్యం చేసింది. పేదలు ఎల్లప్పుడు మీతోనే ఉంటారు, కాని నేను మీతో ఉండను. ఈమె ఈ పరిమళద్రవ్యంను నా శరీరం మీద పోసి, నా భూస్థాపన కొరకు నన్ను సిద్ధం చేసింది. సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడినా, అక్కడ ఈమె చేసింది జ్ఞాపకం చేసుకొని, ఈమె చేసినదాని గురించి కూడా చెప్పుకుంటారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను” అని వారితో అన్నారు. అప్పుడు పన్నెండుమందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా, ముఖ్యయాజకుల దగ్గరకు వెళ్లి, “నేను యేసును మీకు పట్టించడానికి నాకు ఏమి ఇస్తారు?” అని వారిని అడిగాడు. అందుకు వారు ముప్పై వెండి నాణాలు లెక్కపెట్టి వానికి ఇచ్చారు. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించడానికి తగిన అవకాశం కొరకు ఎదురు చూసాడు. పులియని రొట్టెల పండుగ మొదటి రోజున, శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, “నీ కొరకు పస్కా భోజనం సిద్ధం చేయడానికి మమ్మల్ని ఎక్కడికి వెళ్లమంటావు?” అని అడిగారు. అందుకు యేసు, “మీరు పట్టణంలో ఫలాన వ్యక్తి దగ్గరకు వెళ్లి, అతనితో, బోధకుడు ఇలా అన్నాడు: నా సమయం దగ్గరకు వచ్చింది. నేను నా శిష్యులతో కలిసి నీ ఇంట్లో పస్కాను ఆచరిస్తాను అని చెప్పమన్నాడు అని చెప్పండి” అన్నారు. శిష్యులు వెళ్లి యేసు తమకు ఆదేశించిన ప్రకారం చేసి పస్కాను సిద్ధం చేశారు.
Read మత్తయి 26
వినండి మత్తయి 26
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: మత్తయి 26:1-19
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు