మత్తయి సువార్త 25:20-40

మత్తయి సువార్త 25:20-40 TSA

అయిదు తలాంతుల బంగారం తీసికొన్నవాడు ఇంకా అయిదు తలాంతులు తెచ్చి, ‘యజమానుడా, నీవు నాకు అయిదు తలాంతుల బంగారం అప్పగించావు. చూడు, నేను ఇంకా అయిదు తలాంతులను సంపాదించాను’ అని చెప్పాడు. “అతని యజమాని అతనితో, ‘భళా, నమ్మకమైన మంచి దాసుడా! నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు; కాబట్టి నిన్ను అనేక వాటి మీద నియమిస్తాను. వచ్చి నీ యజమాని సంతోషంలో పాలుపొందు’ అని అతనితో చెప్పాడు. “అలాగే రెండు తలాంతుల బంగారం తీసికొన్నవాడు కూడా వచ్చాడు. అతడు ‘యజమానుడా, నీవు నాకు రెండు తలాంతుల బంగారం అప్పగించావు; చూడు, నేను ఇంకా రెండు తలాంతులను సంపాదించాను’ అని చెప్పాడు. “అతని యజమాని అతనితో, ‘భళా, నమ్మకమైన మంచి దాసుడా! నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు; కాబట్టి నిన్ను అనేక వాటి మీద నియమిస్తాను. వచ్చి నీ యజమాని సంతోషంలో పాలుపొందు’ అని అతనితో చెప్పాడు. “ఆ తర్వాత ఒక తలాంతు బంగారం తీసికొన్నవాడు వచ్చి, ‘యజమానుడా, నీవు కఠినుడవని, విత్తనాలు విత్తని చోట పంట కోసేవాడవు, వెదజల్లని చోట పంట కూర్చుకునే వాడవని నాకు తెలుసు. కాబట్టి నేను భయపడి వెళ్లి, నీ తలాంతు బంగారాన్ని భూమిలో దాచి పెట్టాను’ అని చెప్పాడు. “అందుకు అతని యజమానుడు వానితో, ‘సోమరియైన చెడ్డ దాసుడా! నేను విత్తనాలు విత్తని చోట కోసే వాడను అని, వెదజల్లని చోట పంట కూర్చుకునే వాడనని నీకు తెలుసు కదా? అలాగైతే, నీవు నా సొమ్మును వడ్డీ వ్యాపారుల దగ్గర పెట్టాల్సింది, అప్పుడు నేను వచ్చి దానిని వడ్డీతో కలిపి తీసుకునేవాన్ని’ అన్నాడు. “ఆ తలాంతును వాని దగ్గరి నుండి తీసుకుని, పది తలాంతుల గలవానికి ఇవ్వండి. ఎందుకంటే కలిగినవానికి మరి ఎక్కువగా ఇవ్వబడుతుంది, అతడు సమృద్ధిగా కలిగి ఉంటాడు. లేనివారి నుండి, వారు కలిగి ఉన్నది కూడా తీసివేయబడుతుంది. అయితే పనికిమాలిన ఈ దాసుని బయటకు చీకటిలోనికి త్రోసివేయండి. అక్కడ ఏడ్వడం పండ్లు కొరకడం ఉంటాయి.” మనుష్యకుమారుడు తన మహిమలో, దేవదూతలందరితో వచ్చేటప్పుడు, ఆయన తన మహిమగల సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. భూప్రజలందరు ఆయన ముందు పోగు చేయబడి ఉంటారు, ఒక గొర్రెల కాపరి మేకల నుండి గొర్రెలను వేరు చేసినట్లు ఆయన వారిని వేరు చేస్తాడు. ఆయన తన కుడి వైపున గొర్రెలను ఎడమవైపున మేకలను వేరుగా నిలబెడతాడు. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నవారితో, “నా తండ్రి ఆశీర్వాదం పొందిన వారలారా; రండి! లోకం సృజింపబడినప్పటి నుండి మీ కోసం సిద్ధపరచి ఉంచిన మీ వారసత్వ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఎందుకంటే, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు, నేను దప్పికతో ఉన్నప్పుడు మీరు నాకు త్రాగడానికి ఇచ్చారు. నేను పరదేశిగా ఉన్నప్పుడు మీరు నన్ను మీ ఇంట్లోకి చేర్చుకొన్నారు. నాకు బట్టలు లేనప్పుడు మీరు నాకు బట్టలు ఇచ్చారు. నేను రోగిగా ఉన్నప్పుడు మీరు నన్ను చూసుకున్నారు. నేను చెరసాలలో ఉన్నప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి నన్ను పరామర్శించారు” అని చెప్తాడు. “అప్పుడు ఆ నీతిమంతులు, ‘ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలితో ఉన్నావని చూసి ఆహారం పెట్టాం? ఎప్పుడు దప్పికతో ఉన్నావని చూసి నీ దాహం తీర్చాము? ఎప్పుడు నీవు పరదేశివని చూసి నిన్ను మా ఇంట్లోకి చేర్చుకున్నాము? ఎప్పుడు బట్టలు లేకపోవడం చూసి బట్టలు ఇచ్చాము? ఎప్పుడు నిన్ను రోగిగా చూసి లేదా చెరసాలలో చూసి పరామర్శించాము?’ అని ఆయనను అడుగుతారు. “అందుకు ఆ రాజు, ‘ఈ నా సహోదర సహోదరీలలో బహు అల్పులైనవారికి చేశారు కాబట్టి, నాకు చేసినట్లే అని ఖచ్చితంగా మీతో చెప్తున్నాను’ అని వారితో అంటాడు.