మత్తయి 24:37-44

మత్తయి 24:37-44 TCV

నోవహు దినాల్లో ఎలా ఉన్నదో, మనుష్యకుమారుని రాకడలో కూడా అలాగే ఉంటుంది. జలప్రళయానికి ముందు దినాలలో, నోవహు ఓడలోనికి వెళ్లిన రోజు వరకు, ప్రజలు తింటూ, త్రాగుతూ, పెండ్లి చేసుకొంటూ, పెండ్లికిస్తూ ఉన్నారు. ఆ జలప్రళయం వచ్చి అందరిని కొట్టుకొని పోయే వరకు వారికి తెలియలేదు. మనుష్యకుమారుని రాకడ కూడా అలాగే ఉంటుంది. ఆ సమయంలో ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరు తీసుకుపోబడతారు ఇంకొకరు విడవబడుతారు. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుతుంటారు, ఒక స్త్రీ తీసుకుపోబడుతుంది ఇంకొక స్త్రీ విడవబడుతుంది. “కనుక ఏ దినము మీ ప్రభువు వస్తాడో మీకు తెలియదు, కనుక మెలకువగా ఉండండి. ఈ విషయం అర్థం చేసుకోండి: దొంగ ఏ సమయంలో వస్తాడో ఒకవేళ ఇంటి యజమానికి తెలిస్తే, అతడు తన ఇంటికి కన్నం వేయకుండా మెలకువగా ఉంటాడు. మనుష్యకుమారుడు మీరు ఎదురు చూడని సమయంలో వస్తారు, కనుక మీరు సిద్ధపడి ఉండండి.