మత్తయి సువార్త 24:1-22

మత్తయి సువార్త 24:1-22 TSA

యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్తుండగా, ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడాలను ఆయనకు చూపించారు. అందుకు యేసు, “మీరు ఇవన్నీ చూస్తున్నారా? ఒక రాయి మీద ఇంకొక రాయి ఉండదు; ప్రతి ఒకటి పడవేయబడుతుంది అని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అని వారితో అన్నారు. యేసు ఒలీవల కొండమీద కూర్చుని ఉన్నప్పుడు, తన శిష్యులు ఆయన దగ్గరకు ఒంటరిగా వచ్చారు. వారు, “ఈ సంగతులు ఎప్పుడు జరుగుతాయి, నీ రాకడకు యుగాంతం కావడానికి సూచనలు ఏమైనా కనబడతాయా?” మాకు చెప్పుమని అడిగారు. యేసు వారితో, “ఎవరు మిమ్మల్ని మోసగించకుండ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అనేకులు నా పేరిట వచ్చి, ‘నేనే క్రీస్తును’ అని చెప్పి చాలామందిని మోసం చేస్తారు. మీరు యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాలను గురించి వింటారు. కాని మీరు కలవరపడకుండ జాగ్రత్తగా ఉండండి. అలాంటివన్ని జరగ వలసి ఉంది, కాని అంతం వెంటనే రాదు. జనాల మీదికి జనాలు, రాజ్యాల మీదికి రాజ్యాలు లేస్తాయి. అక్కడక్కడ కరువులు, భూకంపాలు వస్తాయి. ఇవన్నీ ప్రసవ వేదనలకు ప్రారంభం మాత్రమే. “అప్పుడు హింసించబడడానికి మరణానికి మీరు అప్పగించబడతారు, నన్ను బట్టి మీరు అన్ని రాజ్యాలచేత ద్వేషించబడతారు. ఆ సమయంలో అనేకులు తమ నమ్మకాన్ని వదులుకొని ఒకరినొకరు ద్వేషించుకొని మోసగించుకుంటారు. అప్పుడు అనేక అబద్ధ ప్రవక్తలు వచ్చి ఎంతోమందిని మోసపరుస్తారు. దుష్టత్వం ఎక్కువవుతూ ఉంటే అనేకుల ప్రేమ చల్లారుతుంది. కాని చివరి వరకు స్థిరంగా నిలబడినవారే రక్షింపబడతారు. ఈ రాజ్యసువార్త సమస్త దేశ ప్రజలకు సాక్ష్యంగా లోకమంతట ప్రకటింపబడిన తర్వాత, అంతం వస్తుంది. “కాబట్టి ‘నిర్జనంగా మారడానికి కారణమైన హేయమైనది’ పరిశుద్ధ స్థలంలో నిలబడడం మీరు చూసినప్పుడు, దానియేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట, చదివేవాడు అర్థం చేసుకొనును గాక. అప్పుడు యూదయలోని వారు కొండల్లోకి పారిపోవాలి. ఇంటిపైన ఉన్నవారెవరు క్రిందికి దిగకూడదు ఇంట్లోకి వెళ్లి దేన్ని బయటకు తీసుకురాకూడదు. పొలంలో ఉన్నవారు తమ పైవస్త్రాన్ని తెచ్చుకోడానికి తిరిగి వెనుకకు వెళ్లకూడదు. ఆ దినాల్లో గర్భిణి స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు శ్రమ! అందుకే చలికాలంలో కాని సబ్బాతు దినాన కాని పారిపోయే పరిస్థితి రాకుండా ప్రార్థించండి. ఎందుకంటే లోకం సృష్టించినప్పటి నుండి నేటి వరకు అలాంటి శ్రమ రాలేదు. మరి ఎప్పటికీ రాదు. “ఒకవేళ ఆ దినాలను తగ్గించకపోతే ఎవ్వరూ తప్పించుకోలేరు, అయితే ఎన్నుకోబడినవారి కోసం ఆ రోజులు తగ్గించబడతాయి.