మత్తయి సువార్త 19:13-30

మత్తయి సువార్త 19:13-30 TSA

అప్పుడు ప్రజలు తమ చిన్నపిల్లలపై యేసు తన చేతులుంచి ప్రార్థించాలని ఆయన దగ్గరకు తీసుకువచ్చారు. కాని శిష్యులు వారిని గద్దించారు. అప్పుడు యేసు, “చిన్న పిల్లలను నా దగ్గరకు రానివ్వండి, వారిని ఆటంకపరచకండి, ఎందుకంటే పరలోక రాజ్యం ఇలాంటి వారిదే” అని చెప్పి, ఆ చిన్నపిల్లల మీద తన చేతులుంచిన తర్వాత ఆయన అక్కడినుండి వెళ్లిపోయారు. అంతలో ఒకడు యేసు దగ్గరకు వచ్చి, “బోధకుడా, నిత్యజీవం పొందుకోవాలంటే నేను ఏ మంచిని చేయాలి?” అని అడిగాడు. అందుకు యేసు, “మంచిని గురించి నన్నెందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే ఉన్నాడు. నీవు జీవంలోనికి ప్రవేశించాలి అంటే ఆజ్ఞలను పాటించు” అని చెప్పారు. అతడు, “ఏ ఆజ్ఞలు?” అని అడిగాడు. అందుకు యేసు, ఈ విధంగా చెప్పారు, “ ‘మీరు హత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధసాక్ష్యం చెప్పకూడదు, మీ తండ్రిని తల్లిని గౌరవించాలి’ ‘మీకులా మీ పొరుగువారిని ప్రేమించాలి’ అనే ఆజ్ఞలు.” అందుకు ఆ యవ్వనస్థుడు, “నేను వీటన్నిటిని పాటిస్తూనే ఉన్నాను. ఇంకా నాలో ఏ కొరత ఉంది?” అని ఆయనను అడిగాడు. అందుకు యేసు, “నీవు ఇంకా పరిపూర్ణతలోనికి రావాలి అంటే వెళ్లి, నీకున్న ఆస్తి అంతా అమ్మి పేదవారికి పంచిపెట్టు అప్పుడు పరలోకంలో నీవు ధనం కలిగి ఉంటావు. తర్వాత వచ్చి నన్ను వెంబడించు” అని చెప్పారు. అయితే ఆ యవ్వనస్థుడు ఆ మాట విని, విచారంగా వెళ్లిపోయాడు, ఎందుకంటే గొప్ప ఆస్తి కలవాడు. అప్పుడు యేసు తన శిష్యులతో, “ఒక ధనవంతుడు పరలోకరాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం అని, నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. ఒక ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది రంధ్రం గుండా దూరడం సులభం” అని చెప్పారు. శిష్యులు ఈ మాట విని చాలా ఆశ్చర్యంతో, “అయితే మరి ఎవరు రక్షణ పొందగలరు?” అని అడిగారు. యేసు వారివైపు చూసి, “ఇది మనుష్యులకు అసాధ్యమే కాని దేవునికి సమస్తం సాధ్యమే” అని చెప్పారు. అప్పుడు పేతురు, “ఇదిగో, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మరి మాకేమి దొరకుతుంది” అని ఆయనను అడిగాడు. అందుకు యేసు వారితో, “అన్ని నూతన పరచబడిన తర్వాత మనుష్యకుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరు పన్నెండు సింహాసనాల మీద కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల వారిని తీర్పుతీర్చుతారు. నా నామాన్ని కలిగి ఉన్నందుకు తన కుటుంబాన్ని, అనగా సహోదరులను, సహోదరీలను, తల్లిని, తండ్రిని, పిల్లలను లేదా పొలాలను గృహాలను నా కోసం విడిచిపెట్టిన ప్రతివాడు నూరురెట్లు పొందుకొని, నిత్యజీవానికి వారసుడు అవుతాడు. అయితే చాలామంది మొదటివారు చివరివారవుతారు, చివరి వారు మొదటివారవుతారు” అని చెప్పారు.