మత్తయి 14:1-14

మత్తయి 14:1-14 TCV

ఆ సమయంలో చతుర్ధాధిపతిగా ఉన్న హేరోదు యేసును గురించి విని, తన సేవకులతో, “ఇతడు బాప్తిస్మమిచ్చు యోహాను, చనిపోయినవారిలో నుండి సజీవంగా లేచాడు అందుకే ఇతనిలో అద్బుతాలు చేసే శక్తి పని చేస్తుంది” అని అన్నాడు. అంతకు ముందు హేరోదు తన సొంత సోదరుడు ఫిలిప్పు భార్యయైన హేరోదియను ఉంచుకోడం న్యాయం కాదని యోహాను అతనితో చెప్పడంతో, హేరోదు రాజు ఆమె కొరకు అతన్ని బంధించి చెరసాలలో వేయించాడు. హేరోదు యోహానును చంపాలని చూశాడు కాని, ప్రజలు అతన్ని ప్రవక్తగా భావిస్తున్నారని ప్రజలకు భయపడి చంపలేక పోయాడు. అయితే హేరోదు పుట్టిన రోజున, హేరోదియ కుమార్తె అతిథుల మధ్య నాట్యంచేసి హేరోదును సంతోషపరిచింది. కనుక ఆమె ఏమి అడిగినా ఇస్తాను అని అతడు ఒట్టుపెట్టుకొని ప్రమాణం చేశాడు. ఆమె తన తల్లి ప్రేరేపణతో, “బాప్తిస్మమిచ్చు యోహాను తలను పళ్లెంలో పెట్టి నాకు ఇప్పించు” అని అడిగింది. రాజు ఎంతో దుఃఖించాడు, కాని తనతో కూడ భోజనానికి కూర్చున్న అతిథులు మరియు తాను చేసిన ప్రమాణం కొరకు, ఆమె కోరిక ప్రకారం చేయమని ఆదేశించాడు. అలా తన దాసుని పంపి చెరసాలలో యోహాను తలను నరికించాడు. వారు బాప్తిస్మమిచ్చు యోహాను తలను పళ్లెంలో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చారు, ఆమె దానిని తన తల్లి దగ్గరకు తీసికొని వెళ్లింది. యోహాను శిష్యులు వచ్చి అతని శవాన్ని తీసుకువెళ్లి సమాధి చేసి, యేసు దగ్గరకు వచ్చి ఈ సంగతిని తెలియజేసారు. యేసు జరిగిన సంగతిని విని పడవ ఎక్కి, అక్కడి నుండి ఏకాంత స్థలానికి వెళ్లారు. దీని గురించి విని, పట్టణాల నుండి కాలినడకన జనసమూహాలు ఆయనను వెంబడించారు. యేసు పడవ దిగి వచ్చిన ఆ గొప్ప జనసమూహాన్ని చూసినప్పుడు, వారి మీద కనికరపడి వారిలో ఉన్న రోగులను స్వస్థపరిచారు.