మత్తయి సువార్త 13:19-34
మత్తయి సువార్త 13:19-34 TSA
పరలోక రాజ్యాన్ని గురించి వాక్యాన్ని విని దానిని గ్రహించలేకపోతే, దుర్మార్గుడు వచ్చి వారి హృదయాల్లో విత్తబడిన దానిని ఎత్తుకుపోతాడు. వారు దారి ప్రక్కన పడిన విత్తనాలు. రాతి నేలలో పడిన విత్తనాలు అంటే, వాక్యాన్ని విని దానిని సంతోషంతో అంగీకరించేవారు. అయితే వారిలో వేరు లేకపోవడంతో కొంతకాలమే నిలబడతారు. వారికి వాక్యాన్ని బట్టి కష్టాలు హింసలు ఎదురైనప్పుడు వారు త్వరగా పడిపోతారు. ముళ్ళపొదల్లో పడిన విత్తనాలు అంటే, వాక్యాన్ని వింటారు కాని జీవితాల్లో ఎదురయ్యే ఇబ్బందులు, ధనవ్యామోహం ఆ వాక్యాన్ని అణచివేసి ఫలించకుండా చేస్తాయి. అయితే మంచి నేలలో పడిన విత్తనాలు అంటే, వాక్యాన్ని విని గ్రహించినవారు, వారిలో కొందరు వందరెట్లు, కొందరు అరవైరెట్లు, మరికొందరు ముప్పైరెట్లు ఫలిస్తారు” అని చెప్పారు. “ఆయన వారికి మరొక ఉపమానం చెప్పారు, పరలోక రాజ్యం తన పొలంలో మంచి విత్తనాలను విత్తిన రైతును పోలి ఉంది. కాని అందరు నిద్రపోతున్నప్పుడు, అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య కలుపు మొక్కల విత్తనాలు చల్లాడు. గోధుమ విత్తనం పెరిగి కంకులు వేసినప్పుడు ఆ కలుపు మొక్కలు కూడా కనిపించాయి. “ఆ పొలంలో పని చేసే దాసులు వచ్చి యజమానిని, ‘అయ్యా, నీ పొలంలో మంచి విత్తనాలను చల్లావు కదా! ఈ కలుపు మొక్కలు ఎలా వచ్చాయి?’ అని అడిగారు. “ఆయన వారితో, ‘ఇది శత్రువు చేసిన పని’ అన్నాడు. “అందుకు ఆ దాసులు, ‘అయితే మమ్మల్ని వెళ్లి ఆ కలుపు మొక్కలను పీకెయ్యమంటారా?’ అని అడిగారు. “అందుకతడు ‘వద్దు, ఎందుకంటే కలుపు మొక్కలను పీకివేసేటప్పుడు వాటితో గోధుమ మొక్కలను కూడా పీకేస్తారేమో. కోతకాలం వరకు రెండింటిని కలిసి పెరగనివ్వండి. కోతకాలం వచ్చినప్పుడు ముందుగా కలుపు మొక్కలను పోగు చేసి వాటిని కాల్చివేయడానికి కట్టలుగా కట్టి ఆ తర్వాత గోధుమలను నా ధాన్యపు కొట్టులోనికి చేర్చండి అని కోత కోసే వారితో చెప్తాను అన్నాడు.’ ” ఆయన వారికి మరో ఉపమానం చెప్పారు, “పరలోక రాజ్యం, ఒకడు తన పొలంలో నాటిన ఆవగింజ లాంటిది. అది విత్తనాలన్నింటిలో చిన్నదైనప్పటికి అది పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటి కంటే పెద్దగా పెరిగి, పక్షులు వచ్చి దాని కొమ్మల్లో గూళ్ళు కట్టుకునే ఒక చెట్టుగా ఎదుగుతుంది.” యేసు వారికి మరో ఉపమానం చెప్పారు, “పరలోక రాజ్యం ఒక స్త్రీ ఇరవై ఏడు కిలోల పిండిని కలిపి ఆ పిండంతా పొంగడానికి దానిలో కలిపిన కొంచెం పులిసిన పిండి లాంటిది.” యేసు ఈ సంగతులను ఉపమానాలుగా జనసమూహానికి చెప్పారు. ఆయన ఉపమానం లేకుండా వారికేమి చెప్పలేదు.


