మత్తయి సువార్త 12:7-21

మత్తయి సువార్త 12:7-21 TSA

‘నేను దయను కోరుతున్నాను, బలిని కాదు’ అనే మాటల అర్థం ఒకవేళ మీకు తెలిసి ఉంటే, మీరు నిర్దోషులకు తీర్పు తీర్చేవారు కారు. ఎందుకంటే మనుష్యకుమారుడు సబ్బాతు దినానికి ప్రభువు” అని చెప్పారు. ఆయన అక్కడినుండి వెళ్తూ, వారి సమాజమందిరంలో వెళ్లారు. అక్కడ చేతికి పక్షవాతం కలవాడు ఒకడున్నాడు. యేసు మీద నేరం మోపడానికి కారణం వెదుకుతున్న కొందరు, “సబ్బాతు దినాన బాగుచేయడం ధర్మశాస్త్రానుసారమా?” అని అడిగారు. అందుకు యేసు వారితో, “మీలో ఎవనికైనా ఒక గొర్రె ఉండి అది సబ్బాతు దినాన గుంటలో పడితే దానిని పట్టుకుని బయటకు తీయకుండా ఉంటారా? గొర్రె కంటే మనిషి విలువ ఎంతో ఎక్కువ కదా! కాబట్టి సబ్బాతు దినాన మంచి చేయడం ధర్మశాస్త్ర ప్రకారం న్యాయమే” అన్నారు. ఆయన ఆ వ్యక్తితో, “నీ చేయి చాపు” అన్నారు. వాడు దాన్ని చాపగానే అది రెండవ చేయిలా పూర్తిగా బాగయింది. కానీ పరిసయ్యులు బయటకు వెళ్లి యేసును ఎలా చంపుదామా అని ఆయన మీద పన్నాగం పన్నారు. యేసు ఆ సంగతిని తెలుసుకొని అక్కడినుండి వెళ్లిపోయారు. చాలా గొప్ప జనసమూహం ఆయనను వెంబడించింది. ఆయన రోగులందరిని బాగుచేశారు. ఆయన తన గురించి ఇతరులకు చెప్పవద్దని వారిని హెచ్చరించారు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది నెరవేరేలా అది అలా జరిగింది. అదేమిటంటే: “ఇదిగో, నేను ఏర్పరచుకున్న నా సేవకుడు, నేను ప్రేమించేవాడు, ఇతని గురించి నేను ఆనందిస్తున్నాను; ఇతనిపై నా ఆత్మను ఉంచుతాను. ఇతడు దేశాలకు న్యాయం జరిగిస్తాడు. ఆయన జగడమాడడు, అరవడు కేకలు వేయడు; వీధుల్లో ఆయన స్వరం ఎవరికీ వినిపించదు. న్యాయాన్ని వ్యాపింపచేసే వరకు ఆయన నలిగిన రెల్లును విరువడు, మంటలేకుండా కాలి పొగవస్తున్న వత్తిని ఆర్పడు. దేశాలు ఈయన నామంలో నిరీక్షణ కలిగి ఉంటాయి.”