మత్తయి సువార్త 12:30-42

మత్తయి సువార్త 12:30-42 TSA

“నాతో లేనివారు నాకు వ్యతిరేకులు, నాతో చేరనివారు చెదరగొట్టబడతారు. అందుకే ప్రతి పాపానికి, దూషణకు క్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే మాటకు క్షమాపణ లేదని నేను మీతో చెప్తున్నాను. మనుష్యకుమారునికి విరోధంగా మాట్లాడే వారికైనా క్షమాపణ ఉంది కానీ, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే ఎవరికైనా క్షమాపణ ఈ యుగంలో కానీ రాబోయే యుగంలో కానీ ఉండదు. “చెట్టు మంచిదైతే దాని ఫలం మంచిదవుతుంది, చెట్టు చెడ్డదైతే దాని ఫలం చెడ్డదవుతుంది, ఎందుకంటే చెట్టు దాని ఫలాన్నిబట్టి గుర్తించబడుతుంది. సర్పసంతానమా! మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలను ఎలా పలకగలరు? హృదయం దేనితో నిండి ఉందో దానినే నోరు మాట్లాడుతుంది. మంచివారు తమ మంచి హృదయ ధననిధిలో నుండి మంచివాటినే బయటకు తీస్తారు, అలాగే చెడ్డవారు తమ హృదయ నిధిలో నుండి చెడ్డవాటినే బయటకు తీస్తారు. కాని నేను మీతో చెప్పేది ఏంటంటే ప్రతి వ్యక్తి తాను అజాగ్రత్తతో పలికిన ప్రతి మాట కోసం తీర్పు రోజున లెక్క అప్పగించాల్సిందే. ఎందుకంటే నీ మాటలను బట్టే నీవు నిర్దోషిగా, నీ మాటలను బట్టే నీవు శిక్షకు పాత్రునిగా తీర్పును పొందుకొంటావు.” అప్పుడు, కొందరు పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు యేసు దగ్గరకు వచ్చి, “ఉపదేశకుడా, నీ నుండి ఒక సూచన చూడాలని ఉంది” అన్నారు. అందుకు యేసు వారితో, “దుష్టులు, వ్యభిచారులైన ఈ తరం వారు సూచనను అడుగుతున్నారు! కానీ యోనా ప్రవక్త సూచన తప్ప మరి ఏ సూచన ఈ తరం వారికి ఇవ్వబడదు. ఎలాగైతే యోనా మూడు పగళ్ళు మూడు రాత్రులు ఆ పెద్ద చేప కడుపులో ఉన్నాడో అలాగే మనుష్యకుమారుడు కూడా మూడు రాత్రులు పగళ్ళు భూగర్భంలో ఉంటాడు. నీనెవె ప్రజలు యోనా ప్రకటించినప్పుడు అతని మాటలను విని పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగారు. అయితే ఇప్పుడు యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నా ఆయన మాటలను వినని ఈ తరం వారి మీద నీనెవె న్యాయతీర్పు దినాన నేరం మోపుతారు.” దక్షిణదేశపు రాణి సొలొమోను జ్ఞానాన్ని వినడానికి భూమి అంచుల నుండి వచ్చింది, అయితే సొలొమోను కన్నా గొప్పవాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి తీర్పు దినాన ఆమె ఈ తరం వారితో పాటు లేచి వారిని ఖండిస్తుంది.