లూకా 9:18-62

లూకా 9:18-62 TCV

ఒక రోజు యేసు ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గర ఉన్నారు, అప్పుడు ఆయన, “నేను ఎవరినని ప్రజలు చెప్పుకుంటున్నారు?” అని వారిని అడిగారు. అందుకు వారు, “కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అని; కొందరు ఏలీయా అని, ఇంకొందరు పూర్వకాల ప్రవక్తలలో ఒకడు తిరిగి లేచాడని చెప్పుకొంటున్నారు” అని జవాబిచ్చారు. అయితే ఆయన, “నేనెవరినని మీరనుకొంటున్నారు?” అని అడిగారు. అందుకు పేతురు, “దేవుని అభిషిక్తుడు అనగా క్రీస్తు” అని చెప్పాడు. ఈ విషయం ఎవరితో చెప్పవద్దని వారిని ఖచ్చితంగా హెచ్చరించారు. మరియు ఆయన వారితో, “మనుష్యకుమారుడు అనేక శ్రమలు పొందాలి మరియు యూదా నాయకులచే, ముఖ్య యాజకులచే మరియు ధర్మశాస్త్ర ఉపదేశకులచే తిరస్కరించబడాలి, ఆయన చంపబడి మూడవ రోజున తిరిగి లేస్తాడు” అని చెప్పారు. ఆ తర్వాత ఆయన వారందరితో, “ఎవరైనా నా శిష్యునిగా ఉండాలనుకుంటే తనను తాను తిరస్కరించుకుని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకొనేవారు దానిని పోగొట్టుకొంటారు, కానీ నా కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకొనేవారు దానిని కాపాడుకొంటారు. ఎవరైనా లోకమంతా సంపాదించుకొని, తమ ప్రాణాన్ని పోగొట్టుకొంటే వారికి ఏమి ఉపయోగం? ఎవరైనా నా గురించి గానీ నా మాటల గురించి గానీ సిగ్గుపడితే, మనుష్యకుమారుడు తన తేజస్సుతో తన తండ్రి తేజస్సుతో పరిశుద్ధ దూతల తేజస్సుతో వచ్చినప్పుడు ఆయన వారి గురించి సిగ్గుపడతాడు. “ఇక్కడ నిలబడివున్న వారిలో కొందరు దేవుని రాజ్యాన్ని చూడక ముందు చనిపోరు అని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అన్నారు. యేసు ఈ సంగతి చెప్పిన ఎనిమిది రోజుల తర్వాత, ఆయన పేతురు, యోహాను, యాకోబులను తన వెంట తీసుకొని ప్రార్థన చేయడానికి ఒక కొండ మీదికి వెళ్లారు. ఆయన ప్రార్థిస్తున్నప్పుడు, ఆయన ముఖరూపం మారింది, ఆయన వస్త్రాలు తెల్లగా ధగధగా మెరుస్తున్నాయి. అప్పుడు మోషే, ఏలీయా అనే ఇద్దరు వ్యక్తులు యేసుతో మాట్లడుతూ అద్బుతమైన ప్రకాశంతో కనబడ్డారు. యెరూషలేములో ఆయన నెరవేర్చబోతున్న, ఆయన నిష్క్రమణ గురించి వారు మాట్లాడారు. పేతురు మరియు అతనితో ఉన్నవారు నిద్రమత్తులో ఉన్నారు, కానీ వారు పూర్తిగా మేల్కొనినప్పుడు, ఆయన మహిమను మరియు ఇద్దరు వ్యక్తులు ఆయనతో నిలబడి ఉండడం చూసారు ఆ ఇద్దరు వ్యక్తులు యేసును విడిచి వెళ్తుండగా, పేతురు ఆయనతో, “బోధకుడా, మనం ఇక్కడే ఉండడం మంచిది. మూడు గుడారాలను వేద్దాం, నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలీయాకు ఒకటి” అని అన్నాడు. తాను ఏమి చెప్తున్నాడో తనకే తెలియదు. అతడు మాట్లాడుతున్నప్పుడు, కాంతివంతమైన ఒక మేఘం ప్రత్యక్షమై వారిని కమ్ముకొంది, వారు దానిలోనికి వెళ్లినప్పుడు వారు భయపడ్డారు. ఆ మేఘంలో నుండి ఒక స్వరం, “ఈయన, నేను ఏర్పరచుకొన్న నా కుమారుడు, ఈయన చెప్పేది వినండి” అని చెప్పడం వినబడింది. ఆ స్వరం మాట్లాడినప్పుడు, వారు యేసు ఒంటరిగా ఉండడం చూసారు శిష్యులు తాము చూసిన వాటిని గురించి ఎవరికి చెప్పకుండా తమ మనస్సులోనే ఉంచుకొన్నారు. మరుసటిరోజు, వారు కొండ దిగి వచ్చినప్పుడు, గొప్ప జనసమూహం ఆయనకు ఎదురుగా వచ్చింది. ఆ జనసమూహంలోని ఒకడు బిగ్గరగా పిలిచి, “బోధకుడా, దయచేసి నా కుమారుని వైపు చూడు, నాకు వీడు ఒక్కడే కుమారుడు. అపవిత్రాత్మ వీనిని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేస్తాడు; అది వాన్ని మూర్ఛపోయేలా చేస్తుంది అప్పుడు వాడు నోటి నుండి నురుగు కారుస్తాడు. వానిని విలవిలలాడించి వేధించి వదలుతుంది. దానిని వెళ్లగొట్టమని నేను నీ శిష్యులను బతిమాలుకొన్నాను, కానీ వారి వల్ల కాలేదు” అని చెప్పాడు. యేసు “విశ్వాసంలేని మూర్ఖతరమా, నేను మీతో ఎంతకాలం ఉంటాను? ఎంతకాలం మీ అవిశ్వాసాన్ని సహిస్తాను? నీ పిల్లవాన్ని నా దగ్గరకు తీసుకొనిరా” అన్నారు. వాడు వస్తుండగానే, ఆ దయ్యం వానిని క్రింద పడద్రోసి మూర్ఛపోయేలా చేసింది. కాని యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి, ఆ బాలుని స్వస్థపరచి అతని తండ్రికి అప్పగించారు. దేవుని గొప్పతనాన్ని చూసిన వారంతా ఆశ్చర్యపడ్డారు. యేసు చేసినవాటన్నిటిని చూసి ప్రజలు ఆశ్చర్యపడుతూ ఉంటే, ఆయన తన శిష్యులతో, “నేను చెప్పబోయే మాటలను జాగ్రత్తగా వినండి: మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగించబడబోతున్నాడు” అని చెప్పారు. అయితే వారు ఆ మాటల అర్థాన్ని గ్రహించలేదు. అది వారికి మరుగు చేయబడింది కనుక వారు దానిని తెలుసుకో లేకపోయారు. అంతేకాదు వారు దాని గురించి అడగడానికి కూడా భయపడ్డారు. అప్పుడే వారిలో ఎవరు గొప్ప అని శిష్యుల మధ్య వాదం పుట్టింది. యేసు, వారి ఆలోచనలను తెలుసుకొని, ఒక చిన్నబిడ్డను తన ప్రక్కన నిలబెట్టుకున్నారు. తర్వాత ఆయన వారితో, “ఎవరు ఈ చిన్నబిడ్డను నా పేరట చేర్చుకుంటారో వారు నన్ను చేర్చుకున్నట్టే; నన్ను చేర్చుకొనేవారు నన్ను పంపినవానిని చేర్చుకున్నట్టే. ఎందుకంటే మీ అందరిలో చివరివానిగా ఉండేవారే గొప్పవారు” అని చెప్పారు. యోహాను యేసుతో, “బోధకుడా, నీ పేరట ఒకడు దయ్యాలను వెళ్లగొట్టడం మేము చూసి, వాన్ని ఆపే ప్రయత్నం చేశాం, ఎందుకంటే వాడు మనవాడు కాడు” అని చెప్పాడు. అందుకు యేసు “అలా ఆపవద్దు, ఎందుకంటే, మీకు విరోధి కాని వాడు మీ పక్షంగా ఉన్నవాడు” అని చెప్పారు. తాను పరలోకానికి ఎత్తబడే సమయం ఆసన్నమైనదని గ్రహించి, యేసు యెరూషలేముకు వెళ్లాలని మనస్సును స్థిరపరచుకున్నారు. తన కొరకు బస సిద్ధం చేయడానికి తనకంటే ముందుగా, కొందరిని సమరయ్యుల గ్రామానికి పంపారు. కాని అక్కడి ప్రజలు ఆయన యెరూషలేముకు వెళ్తున్నారని తెలిసి, ఆయనను చేర్చుకోలేదు. ఆయన శిష్యులైన యాకోబు మరియు యోహాను అది చూసి, ఆయనతో, “ప్రభువా, ఆకాశం నుండి అగ్నిని కురిపించి వీరిని నాశనం చేయమంటావా?” అని అడిగారు. అయితే యేసు వారివైపు తిరిగి వారిని గద్దించారు. ఆ తర్వాత ఆయన తన శిష్యులతో మరొక గ్రామానికి వెళ్లారు. వారు దారిన వెళ్తున్నప్పుడు, ఒకడు ఆయనతో, “నీవు ఎక్కడికి వెళ్లినా నేను నిన్ను వెంబడిస్తాను” అని అన్నాడు. అందుకు యేసు, “నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కాని మనుష్యకుమారునికి తలవాల్చుకోడానికి కూడా స్ధలం లేదు” అని అతనితో చెప్పారు. ఆయన ఇంకొకనితో, “నన్ను వెంబడించు” అన్నారు. అందుకు అతడు, “ప్రభువా, మొదట నేను వెళ్లి నా తండ్రిని పాతి పెట్టడానికి నన్ను వెళ్లనివ్వు!” అని అన్నాడు. యేసు అతనితో, “చనిపోయినవారు తమ చనిపోయినవారిని పాతిపెట్టుకొంటారు, నీవైతే వెళ్లి దేవుని రాజ్యం గురించి ప్రకటించు” అని చెప్పారు. ఇంకొకడు ఆయనతో, “ప్రభువా, నేను నిన్ను వెంబడిస్తాను; కానీ మొదట నేను వెళ్లి నా కుటుంబీకులకు వెళ్తున్నానని చెప్పి వస్తా” అన్నాడు. అందుకు యేసు వానితో, “నాగలిపై చేయి వేసాక వెనుకకు తిరిగి చూసేవాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు” అని అన్నారు.