యేసు పన్నెండుమందిని దగ్గరకు పిలిచి దయ్యాలను వెళ్లగొట్టడానికి, వ్యాధులను స్వస్థపరచడానికి వారికి శక్తి, అధికారం ఇచ్చి, దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికి, వ్యాధులను స్వస్థపరచడానికి వారిని పంపారు. ఆయన వారికి, “ప్రయాణం కోసం చేతికర్ర గాని, సంచి గాని, రొట్టె గాని, డబ్బు గాని, రెండవ చొక్కా గాని ఏమి తీసుకుని వెళ్లకూడదు. మీరు ఏ ఇంట్లో ప్రవేశించినా ఆ పట్టణం వదిలే వరకు ఆ ఇంట్లోనే బసచేయండి. ప్రజలు మిమ్మల్ని చేర్చుకోకపోతే, వారికి వ్యతిరేకంగా సాక్ష్యంగా ఉండడానికి మీ పాదాల దుమ్మును దులిపి వారి గ్రామం విడిచి వెళ్లిపొండి” అని చెప్పారు. కాబట్టి వారు సువార్తను ప్రకటిస్తూ ప్రతిచోట రోగులను స్వస్థపరుస్తూ గ్రామ గ్రామానికి వెళ్లారు.
జరుగుతున్న సంగతులన్నిటి గురించి చతుర్థాధిపతియైన హేరోదు విని కలవరపడ్డాడు. ఎందుకంటే కొందరు బాప్తిస్మమిచ్చే యోహాను చనిపోయి మళ్ళీ బ్రతికాడు, అని చెప్పుకుంటున్నారు, మరికొందరు ఏలీయా కనబడ్డాడని, ఇంకొందరు పూర్వకాల ప్రవక్తల్లో ఒకడు తిరిగి లేచాడని చెప్పుకుంటున్నారు. అయితే హేరోదు, “నేను యోహాను తలను తీయించాను కదా, మరి నేను వింటున్నది, ఎవరి గురించి?” అని అనుకున్నాడు. అతడు ఆయనను చూడాలని ప్రయత్నించాడు.
అపొస్తలులు తిరిగివచ్చి, తాము చేసినవి యేసుకు తెలియజేశారు. అప్పుడు యేసు వారిని వెంటబెట్టుకుని బేత్సయిదా అనే గ్రామానికి ఏకాంతంగా వెళ్లారు, అయితే అది తెలుసుకొని జనసమూహాలు ఆయనను వెంబడించారు. ఆయన వారిని చేర్చుకొని వారికి దేవుని రాజ్యం గురించి బోధిస్తూ, అవసరం ఉన్నవారిని స్వస్థపరిచారు.
ప్రొద్దుగూకే సమయంలో ఆ పన్నెండుమంది ఆయన దగ్గరకు వచ్చి, “ఇది మారుమూల ప్రాంతం కాబట్టి జనసమూహాన్ని పంపివేయండి, వారే చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్లి భోజనాన్ని కొనుక్కుంటారు బస చేస్తారు” అన్నారు.
అందుకు ఆయన, “మీరే వారికి ఏదైనా తినడానికి ఇవ్వండి!” అని జవాబిచ్చారు.
అందుకు వారు, “మా దగ్గర అయిదు రొట్టెలు, రెండు చేపలు మాత్రమే ఉన్నాయి కాబట్టి వీరికందరికి పెట్టాలంటే మనం వెళ్లి భోజనం కొని తీసుకురావాలి” అన్నారు. ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు అక్కడ ఉన్నారు.
అయినా ఆయన తన శిష్యులతో, “వారందరిని యాభైమంది చొప్పున గుంపులుగా కూర్చోబెట్టండి” అని చెప్పారు. వారు అలానే చేసి, వారందరిని కూర్చోబెట్టారు. అప్పుడు ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను చేతిలో పట్టుకుని ఆకాశం వైపు కళ్ళెత్తి, కృతజ్ఞత చెల్లించి వాటిని విరిచారు. తర్వాత ప్రజలకు పంచిపెట్టడానికి తన శిష్యులకు ఇచ్చారు. వారందరు తిని తృప్తి పొందారు, తర్వాత శిష్యులు మిగిలిన ముక్కలను పన్నెండు గంపల నిండా నింపారు.