శిష్యులు, ఈ ఉపమాన భావం ఏమిటి? అని ఆయనను అడిగారు. ఆయన, “దేవుని రాజ్యం గురించిన రహస్యాలకు సంబంధించిన జ్ఞానం మీకు ఇవ్వబడింది, కాని ఇతరులతో ఉపమానరీతిలోనే మాట్లాడతాను, ఎందుకంటే,
“ ‘చూస్తూనే ఉంటారు కాని గ్రహించరు,
వింటూనే ఉంటారు కాని అర్థం చేసుకోరు.’
“ఇది ఈ ఉపమాన భావం: విత్తనం దేవుని వాక్యము. దారి ప్రక్కన పడిన విత్తనాలు అంటే, వాక్యాన్ని వింటారు, కానీ నమ్మి రక్షణ పొందకుండా అపవాది వచ్చి వారి హృదయాల్లో నుండి వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. రాతి నేలలో పడిన విత్తనాలు అంటే, వారు వాక్యాన్ని విన్నప్పుడు దానిని సంతోషంతో అంగీకరిస్తారు, కానీ వారిలో వేరు ఉండదు. వారు కొంతకాలమే నమ్ముతారు, శోధన సమయంలో త్వరగా పడిపోతారు. ముళ్ళపొదల్లో పడిన విత్తనాలు అంటే, వారు వాక్యాన్ని వింటారు, కాని కాలం గడిచేకొలది తమ జీవితాల్లో ఎదురయ్యే తొందరలు, ఐశ్వర్యాలు ఆనందాలతో అణచివేయబడడంవల్ల, వాక్యంలో ఎదగరు. అయితే మంచి నేలలో పడిన విత్తనాలు యోగ్యులై మంచి హృదయం కలిగినవారు, వారు వాక్యాన్ని వింటారు, దానిని పాటిస్తారు, పట్టుదలతో ఫలిస్తారు.
“ఎవ్వరూ దీపాన్ని వెలిగించి దానిని మట్టి పాత్ర క్రింద లేదా మంచం క్రింద పెట్టరు. దానికి బదులు, లోపలికి వచ్చే వారికి వెలుగిచ్చేలా, దానిని దీపస్తంభం మీద పెడతారు. ఎందుకంటే మరుగున ఉంచినదేది బయటపడక ఉండదు, దాచిపెట్టబడినదేది తెలియకుండా లేదా బహిర్గతం కాకుండ ఉండదు. కాబట్టి మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. కలిగినవానికి మరి ఎక్కువగా ఇవ్వబడుతుంది; లేనివారి నుండి, తమకు ఉన్నదని అనుకునేది కూడా తీసివేయబడుతుంది” అని చెప్పారు.
యేసు తల్లి సహోదరులు ఆయనను కలవడానికి వచ్చారు, కానీ ప్రజలు గుంపుగా ఉండడంతో ఆయన దగ్గరకు రాలేకపోయారు. అది చూసిన ఒకడు ఆయనతో, “నీ తల్లి నీ సహోదరులు నిన్ను కలవడానికి వచ్చి, బయట వేచి ఉన్నారు” అని చెప్పాడు.
అందుకు ఆయన, “దేవుని వాక్యాన్ని విని, దాని ప్రకారం జీవించేవారే నా తల్లి, నా సహోదరులు” అని జవాబిచ్చారు.
ఒక రోజు యేసు తన శిష్యులతో, “మనం సరస్సు అవతలి వైపుకి వెళ్దాం పదండి” అన్నారు, వారు పడవ ఎక్కి బయలుదేరారు. వారు ప్రయాణం చేస్తూ ఉండగా, యేసు నిద్రపోయారు. అంతలో భయంకరమైన తుఫాను సరస్సు మీదికి వచ్చి, పడవంతా నీళ్లతో నిండిపోవడం మొదలుపెట్టింది, వారు ఎంతో ప్రమాదంలో ఉన్నారు.
కాబట్టి శిష్యులు ఆయన దగ్గరకు వెళ్లి, “బోధకుడా, బోధకుడా, మేము మునిగిపోతున్నాం” అని అంటూ ఆయనను లేపారు.
ఆయన లేచి, గాలిని ఉప్పొంగుతున్న నీటిని గద్దించగానే, తుఫాను ఆగింది, అంతా ప్రశాంతంగా మారింది. అప్పుడు ఆయన, “మీ విశ్వాసం ఎక్కడ?” అని తన శిష్యులను అడిగారు.
అయితే వారు విస్మయంతో భయపడుతూ ఒకనితో ఒకడు, “ఈయన ఎవరు? గాలిని నీళ్లను ఈయన ఆజ్ఞాపించగానే, అవి లోబడుతున్నాయి” అని చెప్పుకొన్నారు.