లూకా సువార్త 7:1-30

లూకా సువార్త 7:1-30 TSA

తన మాటలు వింటున్న ప్రజలకు యేసు ఇదంతా చెప్పడం ముగించిన తర్వాత, ఆయన కపెర్నహూములో ప్రవేశించారు. అక్కడ శతాధిపతికి ఎంతో ఇష్టమైన పనివాడు అనారోగ్యంతో చనిపోయే స్థితిలో ఉన్నాడు. ఆ శతాధిపతి యేసు గురించి విని, యేసును వచ్చి తన దాసుని స్వస్థపరచుమని బ్రతిమాలడానికి యూదా నాయకుల్లో కొందరిని ఆయన దగ్గరకు పంపించాడు. వారు యేసు దగ్గరకు వచ్చినప్పుడు, వారు ఆయనను బ్రతిమాలుతూ, “నీ నుండి మేలు పొందడానికి అతడు యోగ్యుడు, ఎందుకంటే అతనికి మన ప్రజలంటే ప్రేమ మన సమాజమందిరాన్ని కట్టించాడు” అని చెప్పారు. కాబట్టి యేసు వారితో కూడ వెళ్లారు. ఆయన ఆ ఇంటికి దగ్గరగా ఉండగానే, శతాధిపతి తన స్నేహితులను పంపించి, “ప్రభువా, అంత శ్రమ తీసుకోవద్దు, నీవు నా ఇంటికప్పు క్రిందికి రావడానికి కూడా నాకు యోగ్యత లేదు. అందుకే, నేను నీ దగ్గరకు రావడానికి కూడా నాకు యోగ్యత లేదని నేను అనుకుంటున్నాను. కానీ నీవు ఒక మాట చెప్తే చాలు, నా పనివాడు స్వస్థపడతాడు. ఎందుకంటే, నేను కూడా అధికారం క్రింద ఉన్నవాడినే. మాటకు ఉండే అధికారం నాకు తెలుసు. నా అధికారం క్రింద సైనికులున్నారు. నేను ‘వెళ్లండి’ అంటే వెళ్తారు, ‘రండి’ అంటే వస్తారు. నా పనివాన్ని ‘ఇది చేయి’ అంటే చేస్తాడు” అని అన్నాడు. యేసు ఈ మాటలను విని, ఆశ్చర్యపడి, తనను వెంబడిస్తున్న జనసమూహం వైపు తిరిగి, ఆయన ఇలా అన్నారు, “ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను ఇశ్రాయేలులో కూడా కనుగొనలేదని మీతో చెప్తున్నాను.” అప్పుడు శతాధిపతిచే పంపబడినవారు ఇంటికి చేరి ఆ సేవకుడు ఆరోగ్యంగా ఉన్నాడని గుర్తించారు. అది యైన వెంటనే, యేసు నాయీను అనే ఒక గ్రామానికి వెళ్లారు, ఆయన శిష్యులు పెద్ద జనసమూహం ఆయన వెంట వెళ్లారు. ఆయన ఆ గ్రామ ద్వారాన్ని చేరినప్పుడు, చనిపోయిన వానిని బయటకు మోసుకొనిపోతున్నారు. వాని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు ఆమె ఒక విధవరాలు; ఆ గ్రామానికి సంబంధించిన ఒక పెద్ద గుంపు ఆమెతో పాటు ఉంది. ప్రభువు ఆమెను చూసి, ఆమె మీద కనికరపడి, “ఏడవవద్దు” అని ఆమెతో అన్నారు. దానిని మోసేవారు ఆగిపోయి నిలబడ్డారు. అప్పుడు ఆయన వారు మోసుకెళ్తున్న పాడెను ముట్టారు, దానిని మోస్తున్నవారు ఆగిపోయారు. అప్పుడు ఆయన, “నేను నీతో చెప్తున్నాను, చిన్నవాడా, లే!” అన్నారు. ఆ చనిపోయినవాడు లేచి కూర్చుని మాట్లాడడం మొదలుపెట్టాడు, యేసు వానిని అతని తల్లికి అప్పగించారు. వారందరు దేవుని భయంతో నిండి, “మన మధ్య ఒక గొప్ప ప్రవక్త బయలుదేరాడు, దేవుడే తన ప్రజలను దర్శించాడు” అని అంటూ దేవుని స్తుతించారు. ఆయన గురించి ఈ సమాచారం యూదయ చుట్టుప్రక్కల ప్రాంతమంతా వ్యాపించింది. యోహాను శిష్యులు ఈ సంగతులన్నిటిని యోహానుకు తెలియజేశారు. అయితే యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి, వారిని ప్రభువు దగ్గరకు పంపించి, “రావలసిన వాడవు నీవేనా లేదా మేము వేరొకరి కోసం చూడాలా?” అని అడగమన్నాడు. ఆ మనుష్యులు యేసు దగ్గరకు వచ్చి, “బాప్తిస్మమిచ్చే యోహాను మమ్మల్ని నీ దగ్గరకు పంపి, ‘రావలసిన వాడవు నీవేనా? లేదా మేము మరొకరి కోసం ఎదురుచూడాలా?’ అని అడగమన్నాడు” అని చెప్పారు. ఆ సమయంలోనే యేసు అనేకమంది రోగులను, అనారోగ్యం గలవారిని, దయ్యాలు పట్టినవారిని స్వస్థపరచి, అనేకమంది గ్రుడ్డివారికి చూపునిచ్చారు. కాబట్టి యేసు వారితో, “మీరు వెళ్లి చూసినవాటిని, విన్నవాటిని యోహానుకు చెప్పండి; గ్రుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠురోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయినవారు తిరిగి బ్రతుకుతున్నారు, పేదవారికి సువార్త ప్రకటించబడుతుంది. నా విషయంలో అభ్యంతరపడని వాడు ధన్యుడు” అని జవాబిచ్చారు. యోహాను శిష్యులు వెళ్లిపోయిన తర్వాత, యేసు యోహానును గురించి జనసమూహంతో ఈ విధంగా చెప్పారు: “ఏమి చూడడానికి మీరు అరణ్యంలోనికి వెళ్లారు? గాలికి ఊగే రెల్లునా? అది కాకపోతే, మరి ఏమి చూడడానికి వెళ్లారు? విలువైన వస్త్రాలను ధరించిన ఒక వ్యక్తినా? కాదు, విలువైన వస్త్రాలను ధరించి విలాసవంతంగా జీవించేవారు రాజభవనాల్లో ఉంటారు. అయితే ఏమి చూడడానికి మీరు వెళ్లారు? ఒక ప్రవక్తనా? అవును, ప్రవక్తకంటే కూడా గొప్పవాడు అని మీతో చెప్తున్నాను. వాక్యంలో ఇతని గురించే ఈ విధంగా వ్రాయబడింది: “ ‘ఇదిగో, నీకు ముందుగా నా దూతను పంపుతాను, అతడు నీ ముందర నీ మార్గాన్ని సిద్ధపరుస్తాడు.’ స్త్రీలకు పుట్టిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు; అయినప్పటికీ, దేవుని రాజ్యంలో అందరికంటే అల్పమైనవాడు అతనికంటే గొప్పవాడని, నేను చెప్తున్నాను” అన్నారు. ప్రజలందరు, పన్ను వసూలు చేసేవారితో సహా అంతా యేసు మాటలు విని, దేవుని మార్గం సరియైనది అని ఒప్పుకున్నారు. ఎందుకంటే వారు యోహాను చేత బాప్తిస్మం పొందుకున్నారు. పరిసయ్యులు ధర్మశాస్త్ర ప్రావీణ్యులు యోహాను చేత బాప్తిస్మం పొందక, తమ పట్ల దేవుని ఉద్దేశాన్ని నిరాకరించారు.