లూకా సువార్త 5:1-16

లూకా సువార్త 5:1-16 TSA

ఒక రోజు యేసు గెన్నేసరెతు సరస్సు తీరాన నిలబడి ఉన్నారు, ప్రజలు ఆయన చుట్టూ చేరి దేవుని వాక్యాన్ని వింటున్నారు. సరస్సు తీరాన ఆయన రెండు పడవలను చూశారు, జాలరులు వాటిని అక్కడ విడిచిపెట్టి, తమ వలలను కడుక్కుంటున్నారు. ఆయన ఆ పడవలలో ఒక దానిలోకి ఎక్కారు, ఆ పడవ సీమోనుది, కాబట్టి ఆయన తీరం నుండి కొంచెం దూరం తోయమని అతన్ని అడిగారు. ఆయన పడవలో కూర్చుని, అక్కడినుండి ప్రజలకు బోధించారు. ఆయన మాట్లాడడం ముగించాక, ఆయన సీమోనుతో, “పడవను నీటి లోతుకు నడిపించి, చేపలు పట్టడానికి వలలు వేయి” అన్నారు. అందుకు సీమోను, “బోధకుడా, రాత్రంతా కష్టపడినా మేము ఏమి దొరకలేదు. అయినా నీవు చెప్పావు కాబట్టి నేను వలలను వేస్తాను” అని ఆయనతో అన్నాడు. వారు అలా చేసినప్పుడు, విస్తారమైన చేపలు వలల్లో పడి ఆ వలలు పిగిలిపోసాగాయి. అందుకు వారు వేరే పడవల్లోని తమ జతపనివారిని పిలిచి వచ్చి సహాయం చేయమని సైగలు చేశారు, కాబట్టి వారు వచ్చి ఆ రెండు పడవలను నింపగా ఆ బరువుకు ఆ పడవలు మునిగిపోసాగాయి. సీమోను పేతురు జరిగింది చూసి, యేసు మోకాళ్లమీద పడి, “ప్రభువా, నా దగ్గర నుండి వెళ్లిపో; నేను పాపిష్ఠి వాడను!” అన్నాడు. అతడు అతనితో ఉన్నవారందరు విస్తారంగా పట్టిన చేపలను చూసి ఆశ్చర్యపడ్డారు. సీమోను జతపనివారైన జెబెదయి కుమారులైన, యాకోబు యోహానులు కూడా ఆశ్చర్యపడ్డారు. అప్పుడు యేసు సీమోనుతో, “భయపడకు; ఇప్పటినుండి నీవు మనుష్యులను పట్టే జాలరివి” అన్నారు. వారు తమ పడవలను ఒడ్డుకు చేర్చి, అన్నిటిని విడిచి ఆయనను వెంబడించారు. యేసు ఒక పట్టణంలో ఉన్నప్పుడు, కుష్ఠురోగంతో ఉన్న ఒకడు ఆయన దగ్గరకు వచ్చాడు. వాడు యేసును చూసి, నేల మీద సాగిలపడి, “ప్రభువా, నీకిష్టమైతే, నన్ను బాగు చేయి” అని ఆయనను బ్రతిమాలాడు. యేసు చేయి చాపి వాన్ని ముట్టారు. ఆయన వానితో, “నాకు ఇష్టమే, బాగవు” అన్నారు. వెంటనే కుష్ఠురోగం వాన్ని విడిచి వెళ్లింది. అప్పుడు యేసు, “నీవు ఎవరికి చెప్పకు, కాని వెళ్లి, నిన్ను నీవు యాజకునికి చూపించుకొని వారికి సాక్ష్యంగా ఉండేలా, నీ శుద్ధీకరణ కోసం మోషే నియమించిన అర్పణలను అర్పించు” అని వానిని ఆదేశించారు. అయినాసరే ఆయనను గురించిన వార్త మరి ఎక్కువగా వ్యాపించి, ఆయన చెప్పే మాటలను వినడానికి వారి వ్యాధుల నుండి స్వస్థపడడానికి ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చారు. అయితే యేసు తరచుగా ఏకాంత ప్రాంతాలకు వెళ్లి ప్రార్థించారు.