యేసు, పరిశుద్ధాత్మపూర్ణుడై, యోర్దానును విడిచి ఆత్మ చేత అరణ్యంలోనికి నడిపించబడ్డారు, అక్కడ నలభై రోజులు ఆయన అపవాది చేత శోధించబడ్డారు. ఆ రోజుల్లో ఆయన ఏమీ తినలేదు, ఆ రోజులు పూర్తి అవుతుండగా ఆయనకు ఆకలివేసింది.
అపవాది ఆయనతో, “నీవు దేవుని కుమారుడవైతే, ఈ రాయిని రొట్టెగా మారమని చెప్పు” అని అన్నాడు.
అందుకు యేసు, “ ‘మనుష్యులు కేవలం ఆహారం వల్లనే జీవించరు’ అని వ్రాయబడి ఉంది” అని జవాబిచ్చారు.
తర్వాత అపవాది ఆయనను ఒక ఎత్తైన కొండ మీదికి తీసుకువెళ్లి ఒక్క క్షణంలో ప్రపంచంలోని రాజ్యాలన్నిటిని ఆయనకు చూపించాడు. అపవాది ఆయనతో, “వీటన్నిటి రాజ్యాధికారం, వాటి వైభవం నీకు ఇస్తాను; అవి నాకు ఇవ్వబడ్డాయి, నాకిష్టమైన వారికెవరికైనా నేను వాటిని ఇవ్వగలను. నీవు నన్ను ఆరాధిస్తే, ఇవన్నీ నీవే అవుతాయి” అన్నాడు.
అందుకు యేసు, “ ‘నీ ప్రభువైన దేవుణ్ణి ఆరాధించాలి, ఆయనను మాత్రమే సేవించాలి’ అని వ్రాయబడి ఉంది” అని జవాబిచ్చారు.
అపవాది ఆయనను యెరూషలేముకు తీసుకొనివెళ్ళి అక్కడ దేవాలయ శిఖరం మీద నిలబెట్టి “నీవు దేవుని కుమారుడవైతే, ఇక్కడి నుండి క్రిందికి దూకు. ఎందుకంటే ఇలా వ్రాయబడి ఉంది:
“ ‘నిన్ను జాగ్రత్తగా కాపాడడానికి నీ గురించి
ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తారు;
నీ పాదాలకు ఒక రాయి కూడా తగలకుండ,
వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకొంటారు,’ ”
అని అన్నాడు.
అందుకు యేసు, “ ‘నీ ప్రభువైన దేవుని పరీక్షించకూడదు’ అని వ్రాయబడి ఉంది” అని అన్నారు.
అపవాది శోధించడం అంతా ముగించిన తర్వాత, తగిన సమయం వచ్చేవరకు ఆయనను విడిచి వెళ్లిపోయాడు.
యేసు పరిశుద్ధాత్మ శక్తితో తిరిగి గలిలయకు వెళ్లారు, అప్పుడు ఆయన గురించిన వార్త ఆ ప్రాంతమంతా వ్యాపించింది. ఆయన వారి సమాజమందిరాలలో బోధిస్తున్నారు, ప్రతి ఒక్కరు ఆయనను కొనియాడారు.
యేసు తాను పెరిగిన నజరేతు గ్రామానికి వెళ్లినప్పుడు, అలవాటు ప్రకారం సబ్బాతు దినాన ఆయన సమాజమందిరానికి వెళ్లి, వాక్యాన్ని చదవడానికి నిలబడ్డారు. ఆయన చేతికి ప్రవక్తయైన యెషయా వ్రాసిన గ్రంథాన్ని వారు అందించారు. ఆయన ఆ గ్రంథపు చుట్టను విప్పుతుండగా ఒకచోట ఈ విధంగా వ్రాయబడి ఉండడం కనిపించింది:
“ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది,
బీదలకు సువార్త ప్రకటించడానికి,
ఆయన నన్ను అభిషేకించారు;
చెరలో ఉన్నవారికి విడుదలను ప్రకటించడానికి,
గ్రుడ్డివారికి చూపును ఇవ్వడానికి,
బాధింపబడిన వారికి విడుదలను కలుగచేయడానికి,
ప్రభువు హితవత్సరాన్ని ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించారు.”
ఆ తర్వాత ఆ గ్రంథపు చుట్టను చుట్టి, అక్కడ ఉన్న పరిచారకునికి ఇచ్చి కూర్చున్నారు. సమాజమందిరంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆయన మీద దృష్టి సారించారు. అప్పుడు ఆయన వారితో, “ఈ రోజు మీరు వింటూ ఉండగానే ఈ లేఖనం నెరవేరింది” అన్నారు.