లూకా 24:18-27

లూకా 24:18-27 TCV

వారిలో క్లెయొపా అనేవాడు, “గత కొద్ది దినాల్లో యెరూషలేములో జరిగిన సంగతుల గురించి తెలియని వ్యక్తివి నీవొక్కడివేనా? అని అడిగాడు. “ఏ విషయాలు?” అని ఆయన అడిగారు. అందుకు వారు, “నజరేయుడైన యేసును గురించి, ఆయన దేవుని ముందు ప్రజలందరి ముందు, మాటలోను మరియు కార్యాలలోను శక్తిగల ప్రవక్త. మన ముఖ్య యాజకులు మరియు అధికారులు ఆయనను మరణశిక్షకు అప్పగించి, సిలువ వేయించారు; కాని ఇశ్రాయేలు ప్రజలను విమోచించువాడు ఈయనే అని మేము నిరీక్షణ కలిగివున్నాము. ఇంతకన్నా ఏముంది, ఇదంతా జరిగి నేటికి మూడవ రోజు అవుతుంది. దానికి తోడు, మాలో కొందరు స్త్రీలు మమ్మల్ని ఆశ్చర్యపరిచారు. ఈ రోజు తెల్లవారగానే వారు సమాధి దగ్గరకు వెళ్లారు, ఆయన దేహం అక్కడ కనబడలేదు. వారు తిరిగి వచ్చి, దేవదూతలు తమకు కనబడి ‘ఆయన బ్రతికే ఉన్నాడు’ అని చెప్పినట్లు మాకు చెప్పారు. మాతో కూడ ఉన్నవారిలో కొందరు సమాధి దగ్గరకు వెళ్లి, ఆ స్త్రీలు చెప్పినట్లే చూసారు, కానీ వారు యేసును చూడలేదు” అని ఆయనకు చెప్పారు. అందుకాయన, “మీరు ఎంత అవివేకులు, ప్రవక్తలు చెప్పిన మాటలను నమ్మలేని మందమతులుగా ఉన్నారు. క్రీస్తు ఈ శ్రమలు అనుభవించి తన మహిమలో ప్రవేశించకూడదా?” అని వారితో అన్నారు. ఆయన మోషే మొదలుకొని ప్రవక్తలందరు లేఖనాలలో తనను గురించి వ్రాసిన విషయాలను వారికి వివరించారు.