అదే రోజున ఇద్దరు శిష్యులు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్తున్నారు. వారు జరిగిన ఈ విషయాలన్నిటిని గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వారు అలా మాట్లాడుకుంటూ, చర్చించుకుంటూ ఉన్నప్పుడు, యేసు తానే వారి దగ్గరకు వచ్చి వారితో కూడ నడిచారు; కానీ వారు ఆయనను గుర్తించకుండా వారి కళ్ళు మూయబడ్డాయి.
ఆయన వారిని, “మీరు నడుస్తూ మాట్లాడుకుంటున్న మాటలు ఏమిటి?” అని అడిగారు.
అందుకు వారు దిగులు ముఖాలతో నిలబడిపోయారు. వారిలో క్లెయొపా అనేవాడు, “గత కొద్ది దినాల్లో యెరూషలేములో జరిగిన సంగతుల గురించి తెలియని వ్యక్తివి నీవొక్కడివేనా? అని అడిగాడు.
“ఏ విషయాలు?” అని ఆయన అడిగారు.
అందుకు వారు, “నజరేయుడైన యేసును గురించి, ఆయన దేవుని ముందు ప్రజలందరి ముందు, మాటలోను మరియు కార్యాలలోను శక్తిగల ప్రవక్త. మన ముఖ్య యాజకులు మరియు అధికారులు ఆయనను మరణశిక్షకు అప్పగించి, సిలువ వేయించారు; కాని ఇశ్రాయేలు ప్రజలను విమోచించువాడు ఈయనే అని మేము నిరీక్షణ కలిగివున్నాము. ఇంతకన్నా ఏముంది, ఇదంతా జరిగి నేటికి మూడవ రోజు అవుతుంది. దానికి తోడు, మాలో కొందరు స్త్రీలు మమ్మల్ని ఆశ్చర్యపరిచారు. ఈ రోజు తెల్లవారగానే వారు సమాధి దగ్గరకు వెళ్లారు, ఆయన దేహం అక్కడ కనబడలేదు. వారు తిరిగి వచ్చి, దేవదూతలు తమకు కనబడి ‘ఆయన బ్రతికే ఉన్నాడు’ అని చెప్పినట్లు మాకు చెప్పారు. మాతో కూడ ఉన్నవారిలో కొందరు సమాధి దగ్గరకు వెళ్లి, ఆ స్త్రీలు చెప్పినట్లే చూసారు, కానీ వారు యేసును చూడలేదు” అని ఆయనకు చెప్పారు.
అందుకాయన, “మీరు ఎంత అవివేకులు, ప్రవక్తలు చెప్పిన మాటలను నమ్మలేని మందమతులుగా ఉన్నారు. క్రీస్తు ఈ శ్రమలు అనుభవించి తన మహిమలో ప్రవేశించకూడదా?” అని వారితో అన్నారు. ఆయన మోషే మొదలుకొని ప్రవక్తలందరు లేఖనాలలో తనను గురించి వ్రాసిన విషయాలను వారికి వివరించారు.
ఇంతలో వారు వెళ్లవలసిన గ్రామం సమీపించారు, అయితే యేసు ఇంకా ముందుకు వెళ్తున్నట్లు వారికి అనిపించింది. అందుకని వారు, “ప్రొద్దు గ్రుంకి, సాయంకాలం కావచ్చింది, కనుక మాతో కూడ ఉండండి” అని చెప్పి ఆయనను బలవంతం చేశారు. కనుక ఆయన వారితో కూడ ఇంట్లోకి వెళ్లారు.
యేసు వారితో భోజనానికి కూర్చున్నపుడు, ఆయన ఒక రొట్టెను తీసుకుని, కృతజ్ఞత చెల్లించి, దానిని విరిచి వారికి ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు వారి కళ్ళు తెరవబడి ఆయనను గుర్తుపట్టారు, అయితే ఆయన వారికి కనబడకుండా అదృశ్యుడైపోయారు. అప్పుడు వారు ఒకనితో ఒకడు, “ఆయన త్రోవలో మనతో మాట్లాడుతూ లేఖనాలు వివరిస్తూ ఉంటే మన అంతరంగంలో మన హృదయాలు మండుతున్నట్లు అనిపించలేదా?” అని చెప్పుకొన్నారు.