లూకా సువార్త 2:5-21

లూకా సువార్త 2:5-21 TSA

తనతో పెండ్లికి ప్రధానం చేయబడి, గర్భవతిగా ఉన్న మరియతో పాటు తమ పేర్లను నమోదు చేయించుకోవడానికి వెళ్లాడు. వారు అక్కడ ఉన్నపుడు, ఆమె నెలలు నిండి, తన మొదటి కుమారుని కన్నది. సత్రంలో వారికి స్థలం దొరకలేదు, కాబట్టి ఆమె ఆ శిశువును మెత్తని గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పడుకోబెట్టింది. ఆ ప్రాంతంలోని గొర్రెల కాపరులు కొందరు దగ్గరలో ఉన్న పొలాల్లో ఉండి, రాత్రి జామున తమ మందను కాచుకుంటూ ఉన్నారు. ప్రభువు దూత వారికి కనబడినప్పుడు, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించడంవల్ల, వారు భయంతో వణికిపోయారు. అయితే ఆ దూత వారితో, “భయపడకండి, ప్రజలందరికి గొప్ప సంతోషాన్ని కలిగించే శుభవార్తను నేను మీకు తెచ్చాను. దావీదు పట్టణంలో ఈ రోజే రక్షకుడు మీ కోసం పుట్టాడు; ఆయన ప్రభువైన క్రీస్తు. మీరు గుర్తు పట్టడానికి మీకు గుర్తు ఇదే: ఒక శిశువు మెత్తని గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పడుకోబెట్టి ఉండడం మీరు చూస్తారు” అని చెప్పాడు. అప్పుడు అకస్మాత్తుగా ఆ దూతతో పాటు ఆకాశంలో దూతల గొప్ప సమూహం కనబడి, ఈ విధంగా దేవుని స్తుతించారు, “అత్యున్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టమైనవారికి భూమి మీద సమాధానం కలుగును గాక.” ఆ దూతలు వారి దగ్గర నుండి పరలోకానికి వెళ్లిన తర్వాత, ఆ గొర్రెల కాపరులు ఒకరితో ఒకరు, “రండి మనం బేత్లెహేము పట్టణానికి వెళ్లి, దేని గురించైతే ప్రభువు మనకు చెప్పారో, ఆ జరిగిన దానిని చూద్దాం” అని చెప్పుకొన్నారు. కాబట్టి వారు త్వరపడి వెళ్లి మరియను యోసేపును తొట్టిలో పడుకుని ఉన్న శిశువును చూశారు వారు ఆ శిశువును చూసి, ఆ శిశువు గురించి తమతో చెప్పబడిన సంగతులను వారు ఇతరులకు చెప్పారు. గొర్రెల కాపరులు తమతో చెప్పిన మాటలను విన్నవారందరు ఎంతో ఆశ్చర్యపడ్డారు. అయితే మరియ ఆ మాటలన్నింటిని తన హృదయంలో భద్రం చేసుకుని వాటి గురించి ఆలోచిస్తూ ఉండింది. ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా, తాము విని చూసిన వాటన్నిటిని గురించి దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ తిరిగి వెళ్లారు. ఆ శిశువుకు సున్నతి చేయాల్సిన ఎనిమిదవ రోజున, ఆయనను గర్భం దాల్చక ముందు దేవదూత చెప్పినట్లు, ఆయనకు యేసు అని పేరు పెట్టారు.