లూకా సువార్త 2:24-40

లూకా సువార్త 2:24-40 TSA

ప్రభువు ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లుగా: “గువ్వల జతను, లేదా రెండు చిన్న పావురాలను” బలిగా అర్పించడానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో యెరూషలేములో నీతిమంతుడు భక్తిపరుడైన, సుమెయోను అని పిలువబడే ఒక వృద్ధుడున్నాడు. అతడు ఇశ్రాయేలు యొక్క ఆదరణ కోసం ఎదురు చూస్తున్నవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నాడు. అతడు ప్రభువుని అభిషిక్తుని అనగా క్రీస్తును చూడకుండ చనిపోడని పరిశుద్ధాత్మ ద్వార బయలుపరచబడింది. అతడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, దేవాలయ ఆవరణంలోనికి వెళ్లాడు. ధర్మశాస్త్ర ఆచార ప్రకారం శిశువైన యేసుకు జరిగించడానికి ఆయన తల్లిదండ్రులు ఆయనను లోపలికి తీసుకువచ్చినప్పుడు, సుమెయోను ఆ శిశువుని తన చేతుల్లోకి తీసుకుని దేవుని స్తుతిస్తూ, ఇలా అన్నాడు: “సర్వశక్తిగల ప్రభువా, నీ మాట ప్రకారం, ఇప్పుడు సమాధానంతో నీ దాసుని వెళ్లనివ్వు. సర్వలోక ప్రజల కోసం నీవు సిద్ధపరచిన, నీ రక్షణను నా కళ్లారా చూశాను, అది యూదేతరులందరికి నిన్ను ప్రత్యక్షపరచే వెలుగుగా, నీ ప్రజలైన ఇశ్రాయేలు యొక్క మహిమగా ఉన్నది.” ఆయన గురించి చెప్పిన మాటలను విన్న ఆయన తల్లిదండ్రులు ఆశ్చర్యపడ్డారు. సుమెయోను వారిని దీవించి ఆయన తల్లియైన మరియతో: “ఇశ్రాయేలీయులలో అనేకమంది పడిపోవడానికి లేవడానికి కారణంగాను, వ్యతిరేకంగా చెప్పుకోడానికి గుర్తుగాను ఉండడానికి ఈ శిశువు నియమించబడ్డాడు, తద్వారా అనేకమంది హృదయాలోచనలు బయలుపరచబడతాయి, నీ హృదయంలోకి కూడా ఒక ఖడ్గం దూసికొనిపోతుంది.” అలాగే ఆషేరు గోత్రానికి చెందిన, పనూయేలు కుమార్తెయైన, అన్న, అనే ఒక ప్రవక్తి కూడా అక్కడ ఉండింది. ఆమె చాలా వృద్ధురాలు; ఆమె పెళ్ళి చేసుకుని ఏడు సంవత్సరాలు భర్తతో కాపురం చేసి, తర్వాత ఎనభై నాలుగు సంవత్సరాలు నిండేవరకు విధవరాలుగా ఉండింది. ఆమె ఎప్పుడు దేవాలయాన్ని విడిచిపెట్టకుండా, రాత్రింబవళ్ళు ఉపవాస ప్రార్థనలతో ఆరాధిస్తున్నది. ఆమె కూడ ఆ సమయంలోనే దేవాలయ ఆవరణంలో వారి దగ్గరకు వచ్చి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించి, యెరూషలేము విమోచన కోసం ఎదురు చూస్తున్న వారందరితో శిశువు గురించి చెప్పింది. యోసేపు మరియలు ప్రభువు ధర్మశాస్త్రం ప్రకారం అన్ని జరిగించిన తర్వాత, గలిలయలోని నజరేతు అనే తమ పట్టణానికి వెళ్లారు. బాలుడు ఎదిగి బలం పొందుకొన్నాడు; ఆయన జ్ఞానంతో నింపబడ్డాడు, దేవుని దయ ఆయన మీద ఉండింది.