లూకా 18:16-43

లూకా 18:16-43 TCV

కానీ యేసు పిల్లలను తన దగ్గరకు పిలిచి తన శిష్యులతో, “చిన్నపిల్లలను నా దగ్గరకు రానివ్వండి, వారిని ఆటంకపరచకండి. ఎందుకంటే దేవుని రాజ్యం ఇలాంటి వారిదే” అని చెప్పారు. “ఎవరైనా చిన్నపిల్లల్లాగా దేవుని రాజ్యాన్ని స్వీకరించకపోతే, ఎన్నటికి దానిలో ప్రవేశించరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అని అన్నారు. ఒక అధికారి యేసుతో, “మంచి బోధకుడా, నిత్యజీవం పొందుకోవాలంటే నేనేమి చేయాలి?” అని అడిగాడు. అందుకు యేసు, “నీవు నన్ను ఎందుకు మంచివాడనని పిలుస్తున్నావు? దేవుడు తప్ప మంచివారు ఎవ్వరూ లేరు. మీకు ఆజ్ఞలు తెలుసు: ‘వ్యభిచారం చేయకూడదు, నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధసాక్ష్యం చెప్పకూడదు, మీ తల్లిదండ్రులను గౌరవించాలి’ ” అని అన్నారు. అందుకు ఆ అధికారి, “చిన్నప్పటి నుండి నేను వీటిని పాటిస్తూనే ఉన్నాను” అన్నాడు. యేసు అతడు చెప్పింది విని వానితో, “అయినా నీలో ఒక కొరత ఉంది. నీకున్న ఆస్తి అంతా అమ్మి పేదవారికి పంచిపెట్టు, అప్పుడు పరలోకంలో నీవు ధనం కలిగివుంటావు. తర్వాత వచ్చి, నన్ను వెంబడించు” అని చెప్పారు. అయితే ఆ మాట విని, విచారంగా వెళ్లిపోయాడు, ఎందుకంటే అతడు గొప్ప ఆస్తిగలవాడు. యేసు అతన్ని చూసి అతనితో, “ఒక ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది రంధ్రం గుండా దూరడం సులభం” అని చెప్పారు. ఇది విన్న వారు, “అయితే మరి ఎవరు రక్షణ పొందగలరు?” అని అడిగారు. అందుకు యేసు, “మనుష్యులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యం” అని జవాబిచ్చాడు. పేతురు ఆయనతో, “మేము మాకు కలిగిన వాటన్నింటిని విడిచి నిన్ను వెంబడించాము” అన్నాడు. అందుకు యేసు వారితో, “నేను నిజంగా మీతో చెప్పేది ఏంటంటే, దేవుని రాజ్యం కొరకు తన ఇంటిని, భార్యను, సహోదరులను, సహోదరీలను, తల్లిదండ్రులను, పిల్లలను విడిచిపెట్టిన వారు ఈ యుగంలో చాలారెట్లు పొందుకోవడమే కాక, రాబోయే యుగంలో నిత్యజీవాన్ని కూడా తప్పక పొందుకొంటాడు” అని వారితో అన్నారు. యేసు తన పన్నెండు మంది శిష్యులను ఒక ప్రక్కకు పిలిచి, “రండి, మనం యెరూషలేముకు వెళ్తున్నాం, మనుష్యకుమారుని గురించి ప్రవక్తలు వ్రాసిన మాటలన్నీ నెరవేరుతాయి. వారు ఆయనను యూదేతరుల చేతికి అప్పగిస్తారు. వారు ఆయనను అపహసించి, ఆయన మీద ఉమ్మివేసి ఆయనను అవమానపరుస్తారు. వారు ఆయనను కొరడాలతో కొట్టి చంపేస్తారు. కానీ మూడవ రోజున ఆయన తిరిగి లేస్తాడు” అని చెప్పారు. ఆయన చెప్పిన ఈ మాటల్లో శిష్యులు ఏది గ్రహించలేదు. దాని అర్థం వారికి మరుగు చేయబడింది కనుక ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడో వారికి తెలియలేదు. యేసు యెరికో పట్టణ సమీపంలో ఉన్నపుడు, ఒక గ్రుడ్డివాడు దారి ప్రక్కన కూర్చొని భిక్షం అడుక్కొంటున్నాడు. జనసమూహం వెళ్తుందని వాడు విని, “ఆ సందడేంటి?” అని అడిగాడు. అందుకు వారు వానితో, “నజరేతువాడైన యేసు ఈ దారిలో వెళ్తున్నాడు” అని జవాబిచ్చారు. అందుకతడు బిగ్గరగా, “యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించు!” అని కేకలు వేసాడు. ఆ దారిలో వెళ్లేవారు వాన్ని గద్దించారు, నిశ్శబ్దంగా ఉండుమని వానికి చెప్పారు. కాని వాడు, “దావీదు కుమారుడా, నన్ను కరుణించు!” అని ఇంకా బిగ్గరగా కేకలు వేశాడు. తర్వాత యేసు నిలబడి, వానిని తన దగ్గరకు తీసుకొని రమ్మన్నాడు. వాడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు యేసు వానితో, “నేను నీకు ఏమి చేయాలని కోరుతున్నావు?” అని అడిగారు. అందుకు వాడు, “ప్రభువా, నాకు చూపు కావాలి!” అని అన్నాడు. యేసు వానితో, “నీవు చూపును పొందుకో; నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది!” అన్నారు. వెంటనే వాడు చూపు పొందుకొని, దేవుని స్తుతిస్తూ యేసును వెంబడించాడు. ప్రజలందరు ఇది చూసి, వారు కూడా దేవునిని స్తుతించారు.