లూకా సువార్త 12:35-59

లూకా సువార్త 12:35-59 TSA

“సేవ కోసం మీ నడుము కట్టుకోండి, మీ దీపాలను వెలుగుతూ ఉండనివ్వండి, తమ యజమాని పెండ్లి విందునుండి ఎప్పుడు తిరిగి వస్తాడా అని ఎదురుచూస్తూ, అతడు వచ్చి తలుపు తట్టినప్పుడు వెంటనే తలుపు తీయడానికి మెలకువతో సిద్ధంగా ఉన్న సేవకుల్లా ఉండండి. యజమాని వచ్చినప్పుడు ఏ సేవకులు మెలకువగా ఉండడం చూస్తాడో ఆ సేవకులకు మేలు. నేను చెప్పేది నిజం, సేవ చేయడానికి అతడు తన నడుము కట్టుకుని, ఆ సేవకులను భోజనానికి కూర్చోబెట్టి, అతడు అక్కడే వేచి ఉంటాడు. తమ యజమాని మధ్యరాత్రి వచ్చినా లేదా తెల్లవారుజామున వచ్చినా, సిద్ధపడి కనిపించడం ఆ సేవకులకు మేలు. అయితే ఈ విషయం అర్థం చేసుకోండి: దొంగ ఏ సమయంలో వస్తాడో ఒకవేళ ఇంటి యజమానికి తెలిస్తే, అతడు తన ఇంటికి కన్నం వేయకుండా జాగ్రత్తపడతాడు. అలాగే మనుష్యకుమారుడు మీరు ఎదురు చూడని సమయంలో వస్తారు కాబట్టి మీరు సిద్ధపడి ఉండండి” అని చెప్పారు. అప్పుడు పేతురు, “ప్రభువా, ఈ ఉపమానం మాకేనా లేదా అందరికి చెప్తున్నావా?” అని అడిగాడు. అందుకు ప్రభువు, “యజమాని తన ఇంటి సేవకులకు సమయానికి వారి భోజన వేతనం ఇచ్చే బాధ్యతను అప్పగించడానికి, నమ్మకమైన, జ్ఞానం కలిగిన నిర్వాహకుడు ఎవడు? యజమాని తిరిగి వచ్చినప్పుడు అలా చేస్తూ కనిపించడం ఆ సేవకునికి మేలు. ఆ యజమాని తన యావదాస్తి మీద అతన్ని అధికారిగా ఉంచుతాడని నేను మీతో నిశ్చయంగా చెప్తున్నాను. కాని ఒకవేళ ఆ సేవకుడు, ‘నా యజమాని తిరిగి రావడం ఆలస్యం చేస్తున్నాడని’ తన మనస్సులో అనుకుని, తన తోటి సేవకులను, పురుషులు స్త్రీలను కూడా కొట్టడం మొదలుపెట్టి, తింటూ త్రాగుతూ మత్తులో ఉండి! అతడు ఊహించని రోజున ఊహించని సమయంలో యజమాని వస్తాడు, అతడు వాన్ని ముక్కలుగా నరికి అవిశ్వాసులతో అతనికి చోటు ఇస్తాడు. “ఏ సేవకుడైతే తన యజమానుని చిత్తాన్ని ఎరిగి కూడా దాని ప్రకారం సిద్ధపడి తన యజమాని కోరుకున్నట్లుగా చేయడో వాడు అనేక దెబ్బలు తింటాడు. అయితే తెలియక శిక్షకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే పడతాయి. ఎవనికి ఎక్కువగా ఇవ్వబడిందో వాని నుండి ఎక్కువ తీసుకుంటారు; ఎవనికి ఎక్కువ అప్పగించబడిందో, వాని నుండి ఎక్కువ అడుగుతారు.” నేను భూమి మీద అగ్ని వేయడానికే వచ్చాను, ఇప్పటికే అది రగులుకొని మండుతూ ఉండాలని ఎంతో కోరుతున్నాను. అయితే నేను ఒక బాప్తిస్మం పొందాల్సి ఉంది, అది నెరవేరే వరకు ఎంత నిర్బంధంలో ఉన్నానో! నేను భూమి మీదికి సమాధానం తేవడానికి వచ్చానని మీరు అనుకుంటున్నారా? కాదు, కాని విడగొట్టడానికి తేవడానికి. ఇప్పటినుండి అయిదుగురు ఉన్న ఒక కుటుంబంలో ఒకరికి ఒకరు వ్యతిరేకంగా విభజింపబడతారు, ఇద్దరికి వ్యతిరేకంగా ముగ్గురు, ముగ్గురికి వ్యతిరేకంగా ఇద్దరు. ఎలాగంటే, కుమారుని మీదికి తండ్రి, తండ్రి మీదికి కుమారుడు, కుమార్తెకు మీదికి తల్లి, తల్లి మీదికి కుమార్తె, కోడలు మీదికి అత్త, అత్త మీదికి కోడలు, ఇలా వారు విడిపోతారు. ఆయన జనసమూహంతో ఇలా అన్నారు: “పడమర వైపు నుండి మబ్బులు రావడం చూసినప్పుడు మీరు వెంటనే, ‘వాన కురవబోతుంది’ అని అంటారు, అలాగే వాన కురుస్తుంది. అలాగే దక్షిణపు గాలి వీచినప్పుడు, ‘వేడిగా ఉండబోతుంది’ అని అంటారు, అది అలాగే ఉంటుంది. వేషధారులారా! భూమి, ఆకాశం యొక్క వాతావరణ సంకేతాలను ఎలా అర్థం చేసుకోవాలో మీకు తెలుసు. అలాంటప్పుడు ప్రస్తుత కాలాలను ఎలా అర్థం చేసుకోవాలో మీకు తెలియకపోవడమేంటి? “ఏది సరియైనదో మీ అంతట మీరే ఎందుకు విమర్శించుకోలేరు? నీవు నీ విరోధితో న్యాయాధిపతి దగ్గరకు వెళ్తున్నప్పుడు, దారిలో ఉన్నప్పుడే వానితో సమాధానపడే ప్రయత్నం చేయి, లేకపోతే నీ విరోధి నిన్ను న్యాయాధిపతి దగ్గరకు ఈడ్చుకెళ్లవచ్చు, న్యాయాధిపతి నిన్ను అధికారికి అప్పగించి చెరసాలలో వేయించవచ్చు. చివరి పైసా చెల్లించే వరకు నీవు బయట పడలేవు” అని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.