ఒక రోజు ఒక ధర్మశాస్త్ర నిపుణుడు లేచి యేసును పరీక్షిస్తూ, “బోధకుడా, నిత్యజీవం పొందుకోవాలంటే నేనేమి చేయాలి?” అని అడిగాడు.
అందుకు యేసు, “ధర్మశాస్త్రంలో ఏమి వ్రాసి ఉంది? దాన్ని నీవు ఎలా చదువుతావు?” అని అడిగారు.
అందుకు అతడు, “ ‘మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో, మీ పూర్ణబలంతో, మీ పూర్ణమనస్సుతో మీ ప్రభువైన దేవుని ప్రేమించాలి,’ మరియు ‘నిన్ను నీవు ప్రేమించుకొన్నట్లే నీ పొరుగువారిని ప్రేమించు’ ” అని చెప్పాడు.
దానికి యేసు, “నీవు సరిగ్గా చెప్పావు, ఇది చేస్తే నీవు జీవిస్తావు” అని జవాబిచ్చారు.
అయితే అతడు తనను తాను నీతిమంతునిగా చూపించుకోడానికి, “నా పొరుగువాడు ఎవడు?” అని యేసుని అడిగాడు.
అందుకు యేసు, “ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్తూ ఉండగా, బందిపోట్లు అతని మీద దాడి చేశారు. వారు అతని బట్టలు దోచుకొని, అతన్ని కొట్టి, సగం చచ్చినవానిగా అతన్ని విడిచి, వెళ్లిపోయారు. అప్పుడే ఒక యాజకుడు ఆ దారిన వెళ్తూ, వానిని చూసి, వేరే ప్రక్క నుండి వెళ్లిపోయాడు. అలాగే ఒక లేవీయుడు ఆ స్థలానికి వచ్చినప్పుడు వానిని చూసి, వేరే ప్రక్క నుండి వెళ్లిపోయాడు. అయితే ఒక సమరయుడు, ప్రయాణం చేస్తూ, వాడు పడి ఉన్న చోటికి వచ్చాడు; అతడు వానిని చూసినప్పుడు, వాని మీద జాలిపడ్డాడు. అతనికి దగ్గరకు వెళ్లి వానికి నూనె ద్రాక్షరసం పోసి, గాయాలు కట్టాడు. తర్వాత అతడు వానిని తన గాడిద మీద ఎక్కించుకొని, ఒక సత్రానికి తీసుకొనివెళ్ళి వాన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు. మరునాడు అతడు రెండు దేనారాలు తీసి ఆ సత్రపు యజమానికి ఇచ్చాడు. ‘ఇతన్ని జాగ్రత్తగా చూసుకో, నీవు అధనంగా ఇంకా ఏమైనా ఖర్చు చేస్తే, నేను మళ్ళీ వచ్చినప్పుడు దానిని తిరిగి చెల్లిస్తాను’ అని అతనితో చెప్పి వెళ్లాడు.