లూకా 1:5-20

లూకా 1:5-20 TCV

యూదయదేశపు రాజైన హేరోదు రోజులలో అబీయా యాజక శాఖకు చెందిన ఒక యాజకుడు ఉన్నాడు, అతని పేరు జెకర్యా; అతని భార్య అహరోను యాజక వంశీయురాలు, ఆమె పేరు ఎలీసబెతు. వారిద్దరు ప్రభువు ఆజ్ఞలను, శాసనాలను నిందారహితంగా అనుసరిస్తూ దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు. అయితే ఎలీసబెతు గొడ్రాలు కనుక వారికి పిల్లలు కలుగలేదు, పైగా వారిద్దరూ చాలా వృద్ధులు. ఒకసారి జెకర్యా వారి శాఖ విధుల్లో ఉన్నప్పుడు అతడు దేవుని యెదుట యాజకునిగా పరిచర్య చేస్తున్నాడు, యాజకులు వారి సాంప్రదాయం ప్రకారం చీటీలు వేసినప్పుడు, అతనికి దేవాలయంలోనికి వెళ్లి ధూపం వేసే వంతు వచ్చింది. ధూపం వేసే సమయం వచ్చినప్పుడు, సమాజ ప్రజలందరు బయట ప్రార్థిస్తున్నారు. ప్రభువు దూత ధూపవేదికకు కుడి వైపున నిలబడి, అతనికి ప్రత్యక్షమయ్యాడు. జెకర్యా అతన్ని చూసి, ఉలిక్కిపడి, భయంతో బిగుసుకుపోయాడు. ఆ దూత అతనితో, “జెకర్యా భయపడకు; నీ ప్రార్థన వినబడింది. నీ భార్య ఎలీసబెతు నీకు కుమారుని కంటుంది, నీవు అతనికి యోహాను అని పేరు పెట్టాలి. అతడు నీకు సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తాడు, అలాగే అనేకులు అతని పుట్టుకను బట్టి సంతోషిస్తారు. ఎందుకంటే ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడవుతాడు. అతడు ద్రాక్షరసం కానీ మద్యం కానీ త్రాగకూడదు, అతడు పుట్టక ముందే పరిశుద్ధాత్మచేత నింపబడతాడు. ఇశ్రాయేలీయులలోని చాలామందిని అతడు వారి ప్రభువైన దేవుని వైపుకు త్రిప్పుతాడు. అతడు తండ్రుల హృదయాలను పిల్లల వైపుకు మరియు అవిధేయులను నీతిమంతుల జ్ఞానం వైపుకు త్రిప్పి, ప్రజలను ప్రభువు కొరకు సిద్ధపరచడానికి ఏలీయా యొక్క ఆత్మతో మరియు శక్తితో ప్రభువుకు ముందుగా వెళ్తాడు” అన్నాడు. అందుకు జెకర్యా ఆ దూతతో, “ఇది జరుగుతుందని నేను ఎలా నమ్మాలి? నేను ముసలివాడిని, నా భార్య వయస్సు కూడా మీరిపోయింది” అన్నాడు. అందుకు ఆ దూత అతనితో, “నేను గాబ్రియేలును. నేను దేవుని సన్నిధిలో నిలబడి ఉంటాను, నీతో మాట్లాడి నీకు ఈ శుభవార్త చెప్పడానికి నేను నీ దగ్గరకు పంపబడ్డాను. నేనిప్పుడు నీతో చెప్పిన మాటలను నీవు నమ్మలేదు, కనుక నిర్ణీత సమయంలో ఇది జరిగే వరకు, నీవు మూగవానిగా మౌనంగా ఉంటావు” అన్నాడు.