లేవీయ 4:27-35

లేవీయ 4:27-35 TSA

“ ‘సమాజంలోని ఏ సభ్యుడైనా అనుకోకుండ పాపం చేసి, యెహోవా ఆజ్ఞలలో నిషేధించబడిన దేనినైన చేస్తే, వారు అపరాధులు, వారు చేసిన పాపం తెలియ వచ్చినప్పుడు, వారు చేసిన పాపం కోసం తమ అర్పణగా లోపం లేని ఆడ మేకను తీసుకురావాలి. వారు పాపపరిహారబలి యొక్క తలపై చేయి ఉంచి, దహనబలి చేసిన స్థలంలో దానిని వధించాలి. అప్పుడు యాజకుడు తన వ్రేలితో కొంత రక్తాన్ని తీసుకుని దహనబలి యొక్క బలిపీఠం కొమ్ములపై పూసి మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగున పోయాలి. సమాధానబలి నుండి క్రొవ్వును తీసినట్లే వారు కొవ్వంతా తీస్తారు, యాజకుడు దానిని బలిపీఠం మీద యెహోవాకు ఇష్టమైన సువాసనగా కాల్చాలి. ఈ విధంగా యాజకుడు వారికి ప్రాయశ్చిత్తం చేస్తాడు, వారు క్షమించబడతారు. “ ‘ఎవరైనా తమ పాపపరిహారబలిగా గొర్రెపిల్లను తెస్తే, వారు లోపం లేని ఆడదానిని తీసుకురావాలి. వారు దాని తలపై చేయి వేసి దహనబలిని వధించిన స్థలంలో దానిని పాపపరిహారబలిగా వధించాలి. అప్పుడు యాజకుడు పాపపరిహారబలిలో కొంత రక్తాన్ని తన వ్రేలితో తీసుకుని దహనబలి యొక్క బలిపీఠం కొమ్ములపై పూసి మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగున పోయాలి. సమాధానబలి యొక్క గొర్రెపిల్ల నుండి క్రొవ్వును తీసినట్లే వారు సమస్త క్రొవ్వును తీస్తారు, యాజకుడు దానిని యెహోవాకు సమర్పించిన హోమబలుల పైన బలిపీఠం మీద కాల్చాలి. ఈ విధంగా యాజకుడు వారు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తాడు, వారు క్షమించబడతారు.

చదువండి లేవీయ 4