లేవీయ 16:1-14

లేవీయ 16:1-14 TSA

అహరోను ఇద్దరు కుమారులు అనధికార నిప్పుతో యెహోవాను సమీపించినప్పుడు వారు చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడారు. యెహోవా మోషేతో అన్నారు: “నీ సహోదరుడైన అహరోను మందసం మీద ఉన్న ప్రాయశ్చిత్త మూతకు ఎదురుగా ఉన్న తెర వెనుక ఉన్న అతి పరిశుద్ధ స్థలంలోకి ఎప్పుడంటే అప్పుడు రావద్దు అని చెప్పు, అలా వస్తే అతడు చస్తాడు. ఎందుకంటే నేను మేఘంలో ఆ ప్రాయశ్చిత్త మూత మీదే మీకు ప్రత్యక్షమవుతాను. “అహరోను అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్లే విధానం ఇది: మొదట అతడు పాపపరిహారబలిగా ఒక కోడెను, దహనబలి కోసం ఒక పొట్టేలును తేవాలి. అతడు సన్నని నార చొక్కా, సన్నని నారలోదుస్తులు వేసుకోవాలి; సన్నని నార నడికట్టు కట్టుకుని, సన్నని నార పాగా పెట్టుకోవాలి. ఇవి పవిత్ర దుస్తులు; అవి వేసుకోక ముందు అతడు నీటితో స్నానం చేయాలి. అతడు ఇశ్రాయేలు సమాజం నుండి పాపపరిహారబలి కోసం రెండు మేకపోతులను, దహనబలి కోసం ఒక పొట్టేలును తీసుకోవాలి. “అహరోను తనకు, తన ఇంటివారికి ప్రాయశ్చిత్తం చేయడానికి ఎద్దును తన పాపపరిహారబలిగా అర్పించాలి. తర్వాత అతడు రెండు మేకపోతులు తీసుకుని సమావేశ గుడార ద్వారం దగ్గర యెహోవా ఎదుట వాటిని సమర్పించాలి. అహరోను ఆ రెండు మేకపోతుల మధ్య చీట్లు వేయాలి ఎందుకంటే వాటిలో ఒకటి యెహోవా భాగం, మరొకటి విడిచిపెట్టబడే మేక. అప్పుడు అహరోను యెహోవా పేరిట చీటి వచ్చిన మేకను తీసుకుని పాపపరిహారబలిగా అర్పించాలి. విడిచిపెట్టాలి అనే చీటి వచ్చిన మేకను దాని వలన ప్రాయశ్చిత్తం కలిగేలా దాన్ని అడవిలో విడిచిపెట్టడానికి యెహోవా ఎదుట సజీవంగా నిలబెట్టాలి. “అహరోను పాపపరిహారబలిగా ఒక కోడెదూడను తన కోసం తన ఇంటివారి ప్రాయశ్చిత్తం కోసం తీసుకురావాలి, దానిని తన పాపపరిహారబలిగా వధించాలి. అతడు యెహోవా ఎదుట ఉన్న బలిపీఠం మీద ఉన్న నిప్పులతో నింపిన ధూపార్తిని, రెండు పిడికెళ్ళ పరిమళ ధూపం పొడిని తీసుకుని వాటిని తెర వెనుకకు తీసుకెళ్లాలి. అతడు ధూపాన్ని యెహోవా ముందు అగ్ని మీద ఉంచాలి, ధూపం యొక్క పొగ ఒడంబడిక పలకలను కప్పి ఉంచిన ప్రాయశ్చిత్త మూతను కప్పివేస్తుంది, తద్వారా అతడు చనిపోడు. ఆ కోడె రక్తంలో కొంత తన వ్రేలితో తీసుకుని ప్రాయశ్చిత్త మూత ముందు చల్లాలి; తర్వాత దానిలో కొంత రక్తం వ్రేలితో ఏడుసార్లు ప్రాయశ్చిత్త మూత ఎదుట ప్రోక్షించాలి.