యెహోషువ 24:16-33

యెహోషువ 24:16-33 TSA

అప్పుడు ప్రజలు ఇలా జవాబిచ్చారు, “యెహోవాను విడిచిపెట్టి ఇతర దేవతలను సేవించడం మాకు దూరమవును గాక! మమ్మల్ని, మా తల్లిదండ్రులను దాస్య దేశమైన ఈజిప్టు నుండి రప్పించి, మన కళ్లముందు ఆ గొప్ప సూచకక్రియలను చేసింది మన దేవుడైన యెహోవాయే. మా మొత్తం ప్రయాణంలో, మేము ప్రయాణించిన అన్ని దేశాల మధ్య ఆయన మమ్మల్ని రక్షించాడు. ఆ దేశంలో నివసించే అమోరీయులతో సహా ప్రజలందరినీ యెహోవా మన ముందు వెళ్లగొట్టారు. కాబట్టి మేము కూడా యెహోవానే సేవిస్తాం, ఎందుకంటే ఆయనే మన దేవుడు.” యెహోషువ ప్రజలతో, “మీరు యెహోవాను సేవించలేరు. ఆయన పరిశుద్ధ దేవుడు; ఆయన రోషం గల దేవుడు. మీ తిరుగుబాటును, మీ పాపాలను ఆయన క్షమించడు. ఒకవేళ మీరు యెహోవాను విడిచిపెట్టి ఇతర దేవుళ్ళను సేవిస్తే, ఆయన మీకు మేలు చేసినట్టే మీ మీదికి కీడు తెచ్చి మిమ్మల్ని నాశనం చేస్తారు.” అయితే ప్రజలు యెహోషువతో, “లేదు! మేము యెహోవానే సేవిస్తాం” అన్నారు. అప్పుడు యెహోషువ, “మీరు యెహోవాను సేవించడానికి ఎంచుకున్నందుకు మీకు మీరే సాక్షులు” అని అన్నాడు. అందుకు వారు, “అవును, మేము సాక్షులం” అని చెప్పారు. “అలా అయితే, ఇప్పుడు మీ మధ్యనున్న ఇతర దేవుళ్ళను పారవేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మీ హృదయాలను అప్పగించుకోండి” అని యెహోషువ చెప్పాడు. ప్రజలు యెహోషువతో, “మేము మా దేవుడైన యెహోవానే సేవిస్తాం, ఆయనకే లోబడతాం” అన్నారు. ఆ రోజున యెహోషువ ప్రజల కోసం ఒక ఒడంబడిక చేసి షెకెములో వారి కోసం శాసనాలను, చట్టాలను నియమించాడు. యెహోషువ ఈ విషయాలను దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో నమోదు చేసి ఒక పెద్ద రాయిని తీసుకుని దానిని యెహోవా పవిత్ర స్థలం దగ్గర సింధూర వృక్షం క్రింద ప్రతిష్ఠించాడు. యెహోషువ ప్రజలందరితో, “చూడండి! ఈ రాయి మనమీద సాక్షిగా ఉంటుంది. యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ అది విన్నది. మీరు మీ దేవుని విడిచిపెడితే అది మీమీద సాక్ష్యంగా ఉంటుంది” అన్నాడు. ఆ తర్వాత యెహోషువ ప్రజలను ఎవరి వారసత్వానికి వారిని పంపివేశాడు. ఈ సంఘటనలు జరిగిన తర్వాత, నూను కుమారుడు, యెహోవా సేవకుడునైన యెహోషువ నూట పదేళ్ల వయస్సులో చనిపోయాడు. ఎఫ్రాయిం కొండ ప్రాంతంలోని గాయషు పర్వతానికి ఉత్తరాన ఉన్న తిమ్నాత్ సెరహులో అతనికి వారసత్వంగా వచ్చిన దేశంలో వారు అతన్ని పాతిపెట్టారు. యెహోషువ జీవించినంత కాలం, అతనికంటే ఎక్కువకాలం జీవించి యెహోవా ఇశ్రాయేలులో చేసిన ప్రతి కార్యాన్ని అనుభవించిన పెద్దలు ఉన్నంతకాలం ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను సేవించారు. ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో పాతిపెట్టారు. యాకోబు దానిని షెకెము తండ్రియైన హమోరు కుమారుల నుండి వంద వెండి నాణేలకు కొన్నాడు. ఇది యోసేపు వారసుల వారసత్వంగా మారింది. అహరోను కుమారుడైన ఎలియాజరు చనిపోయినప్పుడు ఎఫ్రాయిం కొండసీమల్లో అతని కుమారుడైన ఫీనెహాసుకు ఇచ్చిన గిబియాలో వారతన్ని పాతిపెట్టారు.