యెహోషువ 11:5-23

యెహోషువ 11:5-23 TSA

ఈ రాజులందరూ తమ బలగాలను కలుపుకొని ఇశ్రాయేలీయులతో పోరాడడానికి మేరోము జలాల దగ్గర కలిసి మకాం వేశారు. యెహోవా యెహోషువతో, “వారికి భయపడకు, ఎందుకంటే రేపు ఈ సమయానికి నేను వారందరినీ చంపి ఇశ్రాయేలు ప్రజలకు అప్పగిస్తాను. మీరు వారి గుర్రాల తొడనరాలు తెగకోసి, వారి రథాలను కాల్చివేయాలి” అని చెప్పారు. కాబట్టి యెహోషువ అతనితో పాటు సైనికులంతా బయలుదేరి మేరోము జలాల దగ్గర ఒక్కసారిగా వారి మీద పడ్డారు. యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించారు. వీరు వారిని ఓడించి, మహా పట్టణమైన సీదోను వరకు, మిస్రెఫోత్-మయీము వరకు, తూర్పున మిస్పే లోయవరకు ఏ ఒక్కరు మిగులకుండా వారిని వెంటాడి చంపారు. యెహోవా చెప్పినట్లే యెహోషువ వారికి చేశాడు: అతడు వారి గుర్రాల తొడనరాలు తెగకోసి, వారి రథాలను కాల్చివేశాడు. యెహోషువ ఆ సమయంలో వెనుకకు తిరిగి హాసోరును వశపరచుకున్నాడు. దాని రాజును కత్తితో చంపాడు. (అంతకుముందు హాసోరు ఆ రాజ్యాలన్నిటికీ ముఖ్యపట్టణంగా ఉండేది.) దానిలో ఉన్నవారందరిని కత్తితో చంపారు. ఊపిరి ఉన్న ఎవరినీ విడిచిపెట్టకుండా వారిని పూర్తిగా నాశనం చేశారు. అతడు హాసోరును కాల్చివేశాడు. యెహోషువ ఈ రాజ పట్టణాలన్నిటిని, వాటి రాజులందరినీ పట్టుకుని ఖడ్గంతో చంపాడు. యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని పూర్తిగా నాశనం చేశాడు. అయితే యెహోషువ కాల్చివేసిన హాసోరు తప్ప మట్టి కొండలమీద కట్టిన పట్టణాలను ఇశ్రాయేలీయులు కాల్చివేయలేదు. ఇశ్రాయేలీయులు ఈ పట్టణాలలోని దోపుడుసొమ్మును, పశువులన్నిటిని తమ కోసం తీసుకెళ్లారు, కాని మనుష్యుల్లో ఎవరినీ విడిచిపెట్టకుండా, వాటిని పూర్తిగా నాశనం చేసేంతవరకు ప్రజలందరినీ ఖడ్గంతో చంపారు. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు, మోషే యెహోషువకు ఆజ్ఞాపించాడు, యెహోషువ దానినే చేశాడు; మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన వాటన్నిటిలో అతడు ఏదీ వదల్లేదు. కాబట్టి యెహోషువ ఈ మొత్తం భూమిని స్వాధీనం అనగా కొండసీమ, దక్షిణ ప్రాంతం, గోషేను ప్రాంతమంతా, పశ్చిమ పర్వత ప్రాంతాలు, అరాబా, ఇశ్రాయేలు పర్వతాలు వాటి దిగువ ప్రాంతాలు, హలాకు పర్వతం నుండి శేయీరు వైపు, హెర్మోను పర్వతం క్రింద లెబానోను లోయలోని బయల్-గాదు వరకు అతడు స్వాధీనం చేసుకుని వాటి రాజులందరినీ పట్టుకుని చంపాడు. యెహోషువ ఈ రాజులందరితో చాలా కాలం యుద్ధం చేశాడు. గిబియోనులో నివసిస్తున్న హివ్వీయులు తప్ప, ఏ ఒక్క పట్టణం కూడా ఇశ్రాయేలీయులతో సమాధాన ఒప్పందం చేసుకోలేదు, వారు యుద్ధంలో వారందరినీ పట్టుకున్నారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లుగా, ఇశ్రాయేలీయులు కనికరం లేకుండా వారిని పూర్తిగా నాశనం చేయాలని, ఇశ్రాయేలీయుల మీదకు యుద్ధానికి వచ్చేలా యెహోవా వారి హృదయాలను కఠినపరిచారు. ఆ సమయంలో యెహోషువ వెళ్లి కొండ ప్రాంతంలో అనగా హెబ్రోను, దెబీరు, అనాబు, యూదా, ఇశ్రాయేలు కొండ ప్రాంతమంతా నివసించిన అనాకీయులందరినీ, వారి పట్టణాలను పూర్తిగా నాశనం చేశాడు. ఇశ్రాయేలీయుల భూభాగంలో అనాకీయులు ఎవరూ మిగల్లేదు; గాజా, గాతు, అష్డోదులలో మాత్రమే కొంతమంది మిగిలారు. యెహోవా మోషేకు చెప్పినట్లుగానే యెహోషువ ఆ దేశమంతటిని స్వాధీనం చేసుకుని, ఇశ్రాయేలీయులకు వారి గోత్రాల ప్రకారం వారసత్వంగా దానిని ఇచ్చాడు. తర్వాత దేశం యుద్ధాలు లేకుండ విశ్రాంతిగా ఉంది.