యోబు 7:1-21

యోబు 7:1-21 TSA

“భూమి మీద మానవులకు ఉండేది కఠినమైన సేవ కాదా? వారి రోజులన్నీ కూలివారి రోజులవంటివి కావా? చల్లనినీడ కోసం ఎంతో ఆశపడే దాసునిలా, కూలిడబ్బుల కోసం ఎదురు చూసే కూలివానిలా, నిరర్థకమైన నెలలు నాకు కేటాయించబడ్డాయి, దుఃఖంతో నిండిన రాత్రులు నాకు నియమించబడ్డాయి. నేను పడుకున్నప్పుడు ‘నేను ఎప్పుడు లేస్తాను రాత్రి ఎప్పుడు ముగుస్తుంది?’ అని ఆలోచిస్తాను తెల్లవారే వరకు నేను అటూ ఇటూ దొర్లుతూ ఉంటాను. నా శరీరం పురుగులతో కురుపులతో కప్పబడింది, నా చర్మం పగిలి చీము పట్టింది. “నేతగాని మగ్గం కంటే వేగంగా నా రోజులు గడుస్తున్నాయి, నిరీక్షణ లేకుండానే అవి ముగిసిపోతున్నాయి. దేవా! నా జీవం వట్టి ఊపిరి వంటిదేనని జ్ఞాపకం చేసుకోండి; నా కళ్లు మంచిని మరలా చూడలేవు. ఇప్పుడు నన్ను చూస్తున్నవారి కన్ను ఇకమీదట నన్ను చూడదు; మీరు నా కోసం చూసినా నేను ఇక ఉండను. మేఘం విడిపోయి మాయమైపోయిట్లు, సమాధిలోనికి దిగిపోయినవాడు మరలా తిరిగి రాడు. అతడు తన ఇంటికి మరలా తిరిగి రాడు; అతని స్వస్థలం అతన్ని మరచిపోతుంది. “కాబట్టి నేను మౌనంగా ఉండను; నా ఆత్మలోని వేదన బట్టి మాట్లాడతాను. నా మనస్సులోని బాధను బట్టి నేను ఫిర్యాదు చేస్తాను. మీరు నాకు కాపలా పెట్టడానికి నేనేమైనా సముద్రాన్నా లేదా సముద్రపు క్రూరజంతువునా? నా పడక నాకు ఆదరణ ఇస్తుందని నా మంచం నా బాధను తగ్గిస్తుందని నేను అనుకుంటే, అప్పుడు కూడా కలలతో మీరు నన్ను బెదిరిస్తున్నారు. దర్శనాలతో నన్ను భయపెడుతున్నారు. ఈ శరీరంతో ఇలా జీవించడం కంటే ఊపిరాడకుండా చనిపోవడాన్నే నేను కోరుకుంటాను. నా జీవితాన్ని తృణీకరిస్తున్నాను; నేను ఎల్లకాలం బ్రతకను. నన్ను ఒంటరిగా విడిచిపెట్టండి; నా దినాలు అర్థం లేకుండా ఉన్నాయి. “మీరు మానవులను ఘనపరచడానికి, వారిపై మీరు అంతగా శ్రద్ధ చూపించడానికి, ప్రతి ఉదయం వారిని దర్శించడానికి, అనుక్షణం వారిని పరీక్షించడానికి వారెంతటివారు? ఎంతకాలం మీరు నన్ను చూడడం మానకుండ ఉంటారు? నా ఉమ్మిని మ్రింగేంత వరకు కూడ నన్ను విడిచిపెట్టరా? మనుష్యులను గమనించేవాడా, నేను పాపం చేస్తే, మీకు నేను ఏమి చేశాను? మీరెందుకు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు? మీకు నేనే భారమైపోయానా? ఎందుకు మీరు నా అపరాధాలను క్షమించరు? ఎందుకు నా పాపాలను తీసివేయరు? త్వరలోనే నేను మట్టిలో కలిసిపోతాను, మీరు నా కోసం వెదికినా నేనిక ఉండను.”

చదువండి యోబు 7