యోహాను సువార్త 9:24-41

యోహాను సువార్త 9:24-41 TSA

గ్రుడ్డివానిగా ఉండిన వానిని యూదా అధికారులు మరలా రెండవసారి పిలిపించారు. “నీవు సత్యం చెప్పి దేవుని మహిమపరచు. మాకైతే ఆ వ్యక్తి పాపి అని తెలుసు” అన్నారు. అందుకు అతడు, “ఆయన పాపియో కాడో నాకు తెలియదు. కానీ నాకు తెలిసింది ఒక్కటే. గ్రుడ్డివాడిగా ఉన్న నేను ఇప్పుడు చూడగలుగుతున్నాను” అని చెప్పాడు. అప్పుడు వారు వానిని, “ఆయన నీకేమి చేశాడు? నీ కళ్లను అతడు ఎలా తెరిచాడు?” అని అడిగారు. వాడు వారితో, “నేను మీకు ముందే చెప్పాను కానీ మీరు వినలేదు. మీరు మరలా ఎందుకు వినాలని అనుకుంటున్నారా? మీరు కూడ ఆయన శిష్యులు కావాలనుకుంటున్నారా?” అని అడిగాడు. అప్పుడు వారు అతన్ని దూషించి, “నీవే వాని శిష్యుడవు. మేము మోషే శిష్యులం! దేవుడు మోషేతో మాట్లాడాడని మాకు తెలుసు, కానీ వీడు ఎక్కడి నుండి వచ్చాడో కూడ మాకు తెలియదు” అన్నారు. అందుకు అతడు, “ఆయన ఎక్కడి నుండి వచ్చారో మీకు తెలియక పోవడం ఆశ్చర్యమే! అయినా ఆయన నా కళ్లను తెరిచారు. దేవుడు పాపుల మనవి వినరని మనకు తెలుసు. తన చిత్తాన్ని చేసే భక్తుల మనవి ఆయన వింటారు. భూమి మొదలైనప్పటి నుండి ఏ పుట్టు గ్రుడ్డివాని కళ్లు తెరవబడ్డాయని ఎవరు వినలేదు. ఒకవేళ ఇతడు దేవుని నుండి కానట్లైతే, ఏమి చేయగలిగేవాడు కాదు” అని చెప్పాడు. దానికి వారు, “పుట్టుకతోనే పాపిగా ఉన్న నీవు మాకు బోధిస్తున్నావా?” అని వానిని సమాజమందిరం నుండి బయటకు వెలివేశారు. అతన్ని సమాజమందిరం నుండి బయటకు వెలివేశారని యేసు విని, అతన్ని కనుగొని, “నీవు మనుష్యకుమారుని నమ్ముతున్నావా?” అని అడిగారు. అప్పుడు అతడు, “అయ్యా, ఆయన ఎవరు? నాతో చెబితే నేను ఆయనను నమ్ముతానేమో” అన్నాడు. యేసు, “నీవు ఆయనను చూస్తున్నావు, నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను” అన్నారు. అప్పుడు అతడు, “ప్రభువా, నేను నమ్ముతున్నాను” అని చెప్పి ఆయనను ఆరాధించాడు. అప్పుడు యేసు, “నేను గ్రుడ్డివారు చూసేలా, చూసేవారు గ్రుడ్డివారయ్యేలా తీర్పు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాను” అన్నారు. అక్కడ ఉన్న కొందరు పరిసయ్యులు ఆయన చెప్పిన ఈ మాటలు విని, “అయితే మేము కూడ గ్రుడ్డివారమేనా?” అని అడిగారు. అందుకు యేసు, “మీరు గ్రుడ్డివారైతే మీమీద ఈ పాపం ఉండేది కాదు; కాని చూడగలమని మీరు చెప్పుకుంటున్నారు. కాబట్టి మీ పాపం నిలిచి ఉంటుంది” అని చెప్పారు.