యోహాను 4:13-26

యోహాను 4:13-26 TCV

అందుకు యేసు, “ఈ నీళ్ళు త్రాగిన ప్రతి ఒక్కరికి మళ్ళీ దాహం వేస్తుంది, కానీ నేనిచ్చే నీళ్ళను త్రాగే వారికి ఇక ఎప్పటికీ దాహం వేయదు. నిజానికి, నేనిచ్చే నీళ్ళు వారికి నిత్యజీవానికి నీటి ఊటగా ఉంటుంది” అన్నారు. ఆ స్త్రీ ఆయనతో, “అయ్యా, నాకు దాహం వేయకుండా మరియు నీళ్ళు చేదుకోడానికి ఇంత దూరం రాకుండా ఉండడానికి ఆ నీటిని నాకు ఇవ్వండి” అన్నది. ఆయన ఆమెతో, “వెళ్లి, నీ భర్తను పిలుచుకొనిరా” అని చెప్పారు. అందుకు ఆమె, “నాకు భర్త లేడు” అన్నది. యేసు ఆమెతో, “నీకు భర్త లేడని నీవు చెప్పింది వాస్తవమే. నిజానికి, నీకు ఐదుగురు భర్తలు ఉండేవారు, ఇప్పుడు నీతో ఉన్న వాడు నీ భర్త కాడు. నీవు సత్యమే చెప్పావు” అన్నారు. అప్పుడు ఆ స్త్రీ, “అయ్యా, నీవు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను. మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించారు, కానీ యూదులైన మీరు ఆరాధించవలసిన స్థలం యెరూషలేమని అంటారు” అన్నది. అప్పుడు యేసు ఆమెతో, “అమ్మా, నన్ను నమ్ము, ఒక సమయం వస్తుంది అప్పుడు మీరు తండ్రిని ఈ పర్వతం మీద గాని యెరూషలేములో గాని ఆరాధించరు. సమరయులైన మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు; మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం, ఎందుకంటే రక్షణ యూదులలో నుండే వస్తుంది. అయినా నిజమైన ఆరాధికులు పరలోక తండ్రిని ఆత్మతో, సత్యంతో ఆరాధించే ఒక సమయం వస్తుంది, అది ఇప్పటికే వచ్చేసింది, ఎందుకంటే అలాంటి ఆరాధికుల కొరకే తండ్రి చూసేది. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించే వారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి” అని చెప్పారు. అప్పుడు ఆ స్త్రీ ఆయనతో, “క్రీస్తు వస్తాడని నాకు తెలుసు, ఆయన వచ్చినప్పుడు, ఆయన అన్ని విషయాలను మాకు వివరిస్తాడు” అని అన్నది. అప్పుడు యేసు, “నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను” అని తెలియజేసారు.