యోహాను 4:1-41

యోహాను 4:1-41 TCV

యోహాను కంటే యేసు ఎక్కువమందిని శిష్యులుగా చేసుకొని బాప్తిస్మం ఇస్తున్నట్లు పరిసయ్యులు విన్నారని యేసుకు తెలిసింది. నిజానికి బాప్తిస్మం ఇచ్చింది యేసు కాదు, కాని ఆయన శిష్యులు. కనుక ఆయన యూదయ ప్రాంతాన్ని విడిచి మరొకసారి గలిలయ ప్రాంతానికి తిరిగి వెళ్లారు. ఆయన సమరయ ప్రాంతం గుండా వెళ్లవలసివచ్చింది. కనుక యాకోబు తన కుమారుడైన యోసేపునకు ఇచ్చిన పొలానికి దగ్గరగా ఉన్న సమరయలోని సుఖారనే ఊరికి ఆయన వచ్చారు. అక్కడ యాకోబు బావి ఉంది, యేసు, ప్రయాణం వలన అలసి, ఆ బావి ప్రక్క కూర్చున్నారు. అది మిట్టమధ్యాహ్న సమయం. ఒక సమరయ స్త్రీ నీరు తోడుకోడానికి అక్కడికి వచ్చినప్పుడు, యేసు ఆమెతో, “నాకు త్రాగడానికి నీళ్లు ఇవ్వగలవా?” అని అడిగారు. ఆయన శిష్యులు ఆహారం కొనడానికి ఊరిలోనికి వెళ్లారు. ఆ సమరయ స్త్రీ ఆయనతో, “నీవు యూదుడవు, నేను సమరయ స్త్రీని. నీవు నన్ను త్రాగడానికి ఇవ్వుమని ఎలా అడుగుతావు?” అన్నది. ఎందుకంటే యూదులు సమరయులతో సహవాసం చేయరు. యేసు, “దేవుని బహుమానం మరియు నిన్ను నీళ్ళు అడిగింది ఎవరో నీకు తెలిస్తే, నీవే ఆయనను అడిగియుండేదానివి, ఆయన నీకు జీవజలాన్ని ఇచ్చి ఉండేవాడు” అని ఆమెకు జవాబిచ్చారు. అందుకు ఆమె, “అయ్యా, ఈ బావి చాలా లోతు, పైగా నీళ్ళు తోడుకోడానికి నీ దగ్గర ఏమీ లేదు. మరి ఆ జీవజలం నీకు ఎక్కడ దొరుకుతుంది? మా పితరుడైన యాకోబు ఈ బావిని మాకిచ్చాడు. ఈ బావి నీళ్ళను అతడు, అతని కుమారులు త్రాగారు మరియు అతని పశువులు కూడా త్రాగాయి. నీవు అతనికంటే గొప్పవాడివా?” అని అడిగింది. అందుకు యేసు, “ఈ నీళ్ళు త్రాగిన ప్రతి ఒక్కరికి మళ్ళీ దాహం వేస్తుంది, కానీ నేనిచ్చే నీళ్ళను త్రాగే వారికి ఇక ఎప్పటికీ దాహం వేయదు. నిజానికి, నేనిచ్చే నీళ్ళు వారికి నిత్యజీవానికి నీటి ఊటగా ఉంటుంది” అన్నారు. ఆ స్త్రీ ఆయనతో, “అయ్యా, నాకు దాహం వేయకుండా మరియు నీళ్ళు చేదుకోడానికి ఇంత దూరం రాకుండా ఉండడానికి ఆ నీటిని నాకు ఇవ్వండి” అన్నది. ఆయన ఆమెతో, “వెళ్లి, నీ భర్తను పిలుచుకొనిరా” అని చెప్పారు. అందుకు ఆమె, “నాకు భర్త లేడు” అన్నది. యేసు ఆమెతో, “నీకు భర్త లేడని నీవు చెప్పింది వాస్తవమే. నిజానికి, నీకు ఐదుగురు భర్తలు ఉండేవారు, ఇప్పుడు నీతో ఉన్న వాడు నీ భర్త కాడు. నీవు సత్యమే చెప్పావు” అన్నారు. అప్పుడు ఆ స్త్రీ, “అయ్యా, నీవు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను. మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించారు, కానీ యూదులైన మీరు ఆరాధించవలసిన స్థలం యెరూషలేమని అంటారు” అన్నది. అప్పుడు యేసు ఆమెతో, “అమ్మా, నన్ను నమ్ము, ఒక సమయం వస్తుంది అప్పుడు మీరు తండ్రిని ఈ పర్వతం మీద గాని యెరూషలేములో గాని ఆరాధించరు. సమరయులైన మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు; మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం, ఎందుకంటే రక్షణ యూదులలో నుండే వస్తుంది. అయినా నిజమైన ఆరాధికులు పరలోక తండ్రిని ఆత్మతో, సత్యంతో ఆరాధించే ఒక సమయం వస్తుంది, అది ఇప్పటికే వచ్చేసింది, ఎందుకంటే అలాంటి ఆరాధికుల కొరకే తండ్రి చూసేది. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించే వారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి” అని చెప్పారు. అప్పుడు ఆ స్త్రీ ఆయనతో, “క్రీస్తు వస్తాడని నాకు తెలుసు, ఆయన వచ్చినప్పుడు, ఆయన అన్ని విషయాలను మాకు వివరిస్తాడు” అని అన్నది. అప్పుడు యేసు, “నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను” అని తెలియజేసారు. ఇంతలో ఆయన శిష్యులు అక్కడ చేరుకొని యేసు ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడని చూసి ఆశ్చర్యపడ్డారు. కానీ, “నీకు ఏమి కావాలి? లేక ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు?” అని కాని ఎవరు అడగలేదు. అప్పుడు ఆ స్త్రీ తన నీటి కుండను వదిలిపెట్టి ఊరిలోనికి వెళ్లి ప్రజలతో, “రండి, నేను చేసిందంతా నాతో చెప్పిన వ్యక్తిని చూడండి, ఈయనే క్రీస్తు అయి ఉంటాడా?” అని చెప్పింది. వారు ఊరి నుండి బయలుదేరి ఆయన దగ్గరకు వచ్చారు. ఇంతలో ఆయన శిష్యులు, “రబ్బీ, కొంచెం తినండి” అని ఆయనను వేడుకొన్నారు. అయితే ఆయన, “నా దగ్గర తినడానికి మీకు తెలియని ఆహారం ఉంది” అని వారితో చెప్పారు. అందుకు శిష్యులు ఒకరితో ఒకరు, “ఎవరైనా ఈయనకు ఆహారం తెచ్చారేమో?” అని చెప్పుకొన్నారు. యేసు వారితో, “నన్ను పంపినవాని చిత్తప్రకారం చేసి ఆయన పనిని ముగించడమే నా ఆహారం. ‘కోతకు రావడానికి ఇంకా నాలుగు నెలలు ఉంది’ అని మీరు చెప్పుతారు కదా! నేను మీతో చెప్పేది ఏంటంటే, కళ్ళు తెరిచి పొలాలను చూడండి! పంట పండి కోతకు సిద్ధంగా ఉంది. పంటను కోసేవాడు తన జీతం తీసుకొని, పంటను విత్తినవాడు మరియు కోసేవాడు ఇద్దరూ సంతోషించేలా, పంట అంతా కోసి నిత్యజీవం కొరకు కూర్చుకొంటాడు. ఈ విధంగా ‘విత్తువాడు ఒకడు, కోసేవాడు మరొకడు’ అనే సామెత నిజమే. మీరు పని చేయని పొలంలో పంటను కోయడానికి నేను మిమ్మల్ని పంపించాను. అక్కడ ఇతరులు కష్టపడి పనిచేశారు, వారి కష్ట ఫలాన్ని మీరు కోసుకొని అనుభవిస్తున్నారు” అన్నారు. ఆ ఊరిలోని సమరయులలో అనేకమంది, “నేను చేసింది అంతా ఆయన నాతో చెప్పారు” అని ఆ స్త్రీ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆయనను నమ్మారు. ఆ సమరయులు ఆయన దగ్గరకు వచ్చి, వారితో ఉండుమని వేడుకొన్నప్పుడు ఆయన అక్కడ రెండు రోజులు ఉన్నారు. ఆయన మాటలను బట్టి అనేకమంది విశ్వాసులయ్యారు.