తెల్లవారుజామున, యేసు సరస్సు ఒడ్డున నిలబడి ఉన్నారు, కానీ శిష్యులు ఆయనను యేసు అని గుర్తించలేదు.
ఆయన వారిని పిలిచి, “పిల్లలారా, మీ దగ్గర చేపలు ఏమైనా ఉన్నాయా?” అని అడిగారు.
అందుకు వారు, “లేవు” అని జవాబిచ్చారు.
ఆయన, “పడవకు కుడి వైపున మీ వలలు వేయండి, మీకు దొరుకుతాయి” అని చెప్పగా వారు అలాగే చేశారు. అప్పుడు విస్తారంగా చేపలు పడ్డాయి కాబట్టి వారు ఆ వలలను లాగలేకపోయారు.
యేసు ప్రేమించిన శిష్యుడు సీమోను పేతురుతో, “ఆయన ప్రభువు!” అన్నాడు. “ఆయన ప్రభువు” అని పేతురు విన్న వెంటనే ఇంతకుముందు తీసి వేసిన పైబట్టను తన చుట్టూ వేసుకుని నీటిలోనికి దూకాడు. పడవలో ఉన్న మిగతా శిష్యులు చేపలున్న వలను లాగుతూ ఉన్నారు. అప్పుడు వారు ఒడ్డుకు సుమారు వంద గజాల దూరంలో మాత్రమే ఉన్నారు. వారు ఒడ్డుకు రాగానే, అక్కడ నిప్పులో కాలుతుండిన చేపలను కొన్ని రొట్టెలను చూశారు.
యేసు వారితో, “మీరు ఇప్పుడు పట్టిన చేపలలో కొన్నిటిని తీసుకురండి” అని చెప్పారు. సీమోను పేతురు పడవ ఎక్కి వలను ఒడ్డుకు లాగాడు. ఆ వలలో 153 పెద్ద చేపలున్నాయి. అన్ని చేపలు ఉన్నా ఆ వలలు చిరిగిపోలేదు. యేసు వారితో, “రండి, భోజనం చేయండి” అని పిలిచారు. ఆయనే ప్రభువని వారికి తెలిసింది కాబట్టి ఆ శిష్యులలో ఎవరు ఆయనను, “నీవు ఎవరు?” అని అడగడానికి ధైర్యం చేయలేదు. యేసు వచ్చి రొట్టెను తీసుకుని వారికి పంచారు. అదే విధంగా చేపలను కూడ పంచారు. యేసు తాను చనిపోయి సజీవునిగా లేచిన తర్వాత ఆయన తన శిష్యులకు కనబడడం ఇది మూడవసారి.
వారు తిని ముగించిన తర్వాత యేసు సీమోను పేతురుతో, “యోహాను కుమారుడవైన సీమోనూ, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని అడిగారు.
అతడు, “అవును, ప్రభువా! నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు” అన్నాడు.
అయితే, “నా గొర్రెపిల్లలను మేపుము” అని యేసు చెప్పారు.
మరల యేసు, “యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా?” అని రెండవసారి అడిగారు.
అతడు, “అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు” అని చెప్పాడు.
అందుకు యేసు, “నా గొర్రెలను కాయుము” అన్నారు.
యేసు మూడవసారి అతనితో, “యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగారు.
యేసు తనను మూడవసారి, “నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగినందుకు బాధపడిన పేతురు, “ప్రభువా, నీవు అన్ని తెలిసినవాడవు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అని చెప్పాడు.
అందుకు యేసు, “నా గొర్రెలను మేపుము” నేను మీతో చెప్పేది నిజం, “నీవు యవ్వనస్థునిగా ఉన్నప్పుడు, నీకు నీవే నీ నడుము కట్టుకుని నీకిష్టమైన స్థలాలకు వెళ్లేవాడివి. కాని నీవు ముసలి వాడవైనప్పుడు నీవు నీ చేతులను చాపుతావు, అప్పుడు మరొకడు నీ నడుమును కట్టి నీకు ఇష్టం లేని చోటికి నిన్ను మోసుకువెళ్తాడు” అని చెప్పారు. పేతురు ఎలాంటి మరణం పొంది దేవుని మహిమపరుస్తాడో సూచిస్తూ యేసు ఈ విషయాలను చెప్పారు. ఇలా చెప్పి ఆయన అతనితో, “నన్ను వెంబడించు” అని చెప్పారు.