యోహాను 21:15-22

యోహాను 21:15-22 TCV

వారు తిని ముగించిన తర్వాత యేసు సీమోను పేతురుతో, “యోహాను కుమారుడవైన సీమోను, వీటన్నింటి కన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని అడిగారు. అతడు “అవును, ప్రభువా! నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు” అన్నాడు. అయితే “నా గొర్రెపిల్లలను మేపుము” అని యేసు చెప్పారు. మరల యేసు, “యోహాను కుమారుడవైన సీమోను, నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా?” అని రెండవ సారి అడిగారు. అతడు “అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు” అని చెప్పాడు. అందుకు యేసు, “నా గొర్రెలను కాయుము” అన్నారు. యేసు మూడవసారి అతనితో, “యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగారు. యేసు తనని మూడవసారి “నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగినందుకు బాధపడిన పేతురు, “ప్రభువా, నీవు అన్ని తెలిసినవాడవు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అని చెప్పాడు. అందుకు యేసు, “నా గొర్రెలను మేపుము” నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను, “నీవు యవ్వనస్థునిగా ఉన్నప్పుడు, నీకు నీవే నీ నడుము కట్టుకొని నీకిష్టమైన స్థలాలకు వెళ్లేవాడివి. కాని నీవు ముసలి వాడవైనప్పుడు నీవు నీ చేతులను చాపుతావు, అప్పుడు మరొకడు నీ నడుమును కట్టి నీకు ఇష్టం లేని చోటికి నిన్ను మోసుకువెళ్తాడు” అని చెప్పారు. పేతురు ఎలాంటి మరణం పొంది దేవుని మహిమపరుస్తాడో సూచిస్తూ యేసు ఈ విషయాలను చెప్పారు. ఇలా చెప్పి ఆయన అతనితో, “నన్ను వెంబడించు” అని చెప్పారు. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన శిష్యుడు తమను వెంబడిస్తున్నాడని చూసాడు. భోజనం చేసేప్పుడు యేసు దగ్గరగా ఆనుకొని కూర్చుని, “ప్రభువా, నిన్ను అప్పగించేది ఎవరు?” అని అడిగినవాడు ఇతడే. పేతురు అతన్ని చూసి, “ప్రభువా, అతని సంగతి ఏమిటి?” అని అడిగాడు. అందుకు యేసు, “నేను తిరిగి వచ్చేవరకు అతడు జీవించి ఉండడం నాకు ఇష్టమైతే నీకు ఏమి? నీవు నన్ను వెంబడించాలి” అని జవాబిచ్చారు.

Free Reading Plans and Devotionals related to యోహాను 21:15-22