ఆ తర్వాత పిలాతు యేసుని కొరడాలతో కొట్టించాడు. సైనికులు ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తలమీద పెట్టారు. ఆయనకు ఊదా రంగు వస్త్రాన్ని తొడిగించి, ఆయన దగ్గరకు మాటిమాటికి వెళ్లి ఆయనతో, “యూదుల రాజా నీకు శుభం!” అని ఎగతాళి చేస్తూ, ఆయన ముఖం మీద అరచేతులతో కొట్టారు.
పిలాతు మరొకసారి బయటకు వచ్చి యూదులతో, “చూడండి, ఇతనిలో నాకు ఏ నేరం కనిపించలేదని చెప్పడానికి ఈయనను బయటకు మీ దగ్గరకు తీసుకుని వస్తున్నాను” అని చెప్పాడు. యేసు బయటకు వచ్చినప్పుడు ఆ ముళ్ళ కిరీటాన్ని ఊదా రంగు వస్త్రాన్ని ధరించుకొని ఉన్నారు. పిలాతు వారితో, “ఇదిగో, ఈ మనుష్యుడు!” అని చెప్పాడు.
ముఖ్య యాజకులు వారి అధికారులు ఆయనను చూడగానే, “సిలువ వేయండి! సిలువ వేయండి!” అని కేకలు వేశారు.
అయితే పిలాతు, “మీరే ఆయనను తీసుకెళ్లి సిలువ వేయండి. నాకైతే ఆయనలో ఏ నేరం కనిపించలేదు” అన్నాడు.
అందుకు యూదా నాయకులు, “మా ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైనా తాను దేవుని కుమారుడనని చెప్పుకుంటే చట్టాన్ని బట్టి అతడు చావవలసిందే” అన్నారు.
పిలాతు ఆ మాట విని మరింత భయపడి, తిరిగి తన భవనం లోనికి వెళ్లి, “నీవు ఎక్కడి నుండి వచ్చావు?” అని యేసును అడిగాడు. కాని యేసు అతనికి ఏ జవాబివ్వలేదు. అప్పుడు పిలాతు, “నీవు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయడానికైనా, సిలువ వేయడానికైన నాకు అధికారం ఉందని నీకు తెలియదా?” అన్నాడు.
అందుకు యేసు, “నీకు ఆ అధికారం పైనుండి ఇవ్వబడితేనే తప్ప నా మీద నీకు అధికారం లేదు. కాబట్టి నన్ను నీకు అప్పగించినవాడు నీ కంటే మరి ఎక్కువ పాపం చేశాడు” అన్నారు.
అప్పటినుండి పిలాతు యేసును విడుదల చేయడానికి ప్రయత్నించాడు కాని యూదా నాయకులు, “నీవు ఇతన్ని విడుదల చేస్తే నీవు కైసరుకు స్నేహితుడవు కావు. నేను రాజును అని చెప్పుకునే ప్రతివాడు కైసరుకు విరోధి” అని కేకలు వేశారు.
పిలాతు ఈ మాటలను విని, యేసును బయటకు తీసుకువచ్చి, రాతి బాటగా ప్రసిద్ధి చెందిన స్థలంలో అతడు న్యాయపీఠం మీద కూర్చున్నాడు. హెబ్రీ భాషలో ఆ స్థలానికి గబ్బతా అని పేరు. అది పస్కాను సిద్ధపరచే రోజు, అప్పుడు ఇంచుమించు ఉదయం ఆరు గంటల సమయం అవుతుంది.
పిలాతు, “ఇదిగో మీ రాజు” అని యూదులతో చెప్పాడు.
కాని వారు, “అతన్ని తీసుకెళ్లండి! అతన్ని తీసుకెళ్లండి! సిలువ వేయండి!” అని కేకలు వేశారు.
“మీ రాజును నేను సిలువ వేయనా?” అని పిలాతు అడిగాడు.
అప్పుడు ముఖ్య యాజకులు, “మాకు కైసరు తప్ప వేరే రాజు లేడు” అన్నారు.
చివరికి పిలాతు సిలువ వేయడానికి యేసును వారికి అప్పగించాడు.
కాబట్టి సైనికులు యేసును తీసుకెళ్లారు. యేసు తన సిలువను తానే మోసుకొని కపాల స్థలం అనే చోటికి తీసుకెళ్లారు. హెబ్రీ భాషలో ఆ స్థలానికి “గొల్గొతా” అని పేరు. అక్కడ ఆయనతో పాటు మరో ఇద్దరిని, ఆయనకు ఇరువైపుల ఉంచి వారి మధ్యలో యేసును సిలువ వేశారు.
పిలాతు సిలువకు వ్రాతపూర్వక ఉత్తర్వును తగిలించాడు. అది ఇలా ఉంది:
నజరేతువాడైన యేసు, యూదుల రాజు.
యేసును సిలువ వేసిన స్థలం పట్టణానికి దగ్గరగా ఉంది. ఆ ప్రకటనను హెబ్రీ, లాటిను గ్రీకు భాషల్లో వ్రాయించారు కాబట్టి యూదుల్లో చాలామంది దానిని చదివారు. ముఖ్య యాజకులైన యూదులు దానిని వ్యతిరేకించి పిలాతును, “యూదుల రాజు అని వ్రాయవద్దు కాని యూదులకు రాజునని చెప్పుకునేవాడు” అని వ్రాయమని అడిగారు.
అందుకు పిలాతు, “నేను వ్రాసిందేదో వ్రాసేసాను” అని జవాబిచ్చాడు.