యోహాను సువార్త 11:17-25

యోహాను సువార్త 11:17-25 TSA

యేసు అక్కడికి చేరుకుని, లాజరు శవాన్ని సమాధిలో ఉంచి అప్పటికే నాలుగు రోజులు గడిచాయని తెలుసుకున్నారు. యెరూషలేము నుండి బేతనియకు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. చాలామంది యూదులు మార్తను మరియను వారి సహోదరుని గురించి ఓదార్చడానికి వచ్చారు. మార్త యేసు వస్తున్నారని విని ఆమె ఆయనను ఎదుర్కోడానికి బయటకు వెళ్లింది కాని మరియ ఇంట్లోనే ఉండిపోయింది. మార్త యేసుతో, “ప్రభువా, నీవిక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. ఇప్పుడైనా నీవు దేవుని ఏమి అడిగినా అది నీకు ఇస్తాడని నాకు తెలుసు” అన్నది. యేసు ఆమెతో, “నీ సహోదరుడు మరల లేస్తాడు” అని చెప్పారు. అందుకు మార్త, “చివరి రోజున పునరుత్ధానంలో అతడు తిరిగి లేస్తాడని నాకు తెలుసు” అన్నది. యేసు, “పునరుత్థానం, జీవం నేనే. నన్ను నమ్మినవారు చనిపోయినా మళ్ళీ బ్రతుకుతారు.