యిర్మీయా 42:1-12

యిర్మీయా 42:1-12 TSA

అప్పుడు కారేహ కుమారుడైన యోహానాను, హోషయా కుమారుడైన యెజన్యాతో సహా సైన్య అధికారులందరూ, సామాన్యుల నుండి గొప్పవారి వరకు ప్రజలందరూ, యిర్మీయా ప్రవక్త దగ్గరికి వచ్చి, “దయచేసి మా విన్నపం విని, ఈ మిగిలిన వారందరి కోసం నీ దేవుడైన యెహోవాకు ప్రార్థించు. ఎందుకంటే నీవిప్పుడు చూస్తున్నట్లుగా, మేము ఒకప్పుడు చాలా మందిమే అయినప్పటికీ, ఇప్పుడు కొద్ది మందిమి మాత్రమే మిగిలి ఉన్నాము. మేము ఎక్కడికి వెళ్లాలో, ఏం చేయాలో మాకు తెలియజేయమని నీ దేవుడైన యెహోవాకు ప్రార్థించు” అని అన్నారు. “నేను నీ మాట విన్నాను, మీరు కోరినట్లే నేను మీ దేవుడైన యెహోవాకు తప్పక ప్రార్థిస్తాను; యెహోవా చెప్పినదంతా నేను మీకు చెప్తాను మీ నుండి ఏమీ దాచను” అని యిర్మీయా ప్రవక్త జవాబిచ్చాడు. అప్పుడు వారు యిర్మీయాతో ఇలా అన్నారు: “నీ దేవుడైన యెహోవా నీ ద్వారా మాకు తెలియజేసిన మాటల ప్రకారం మేము చేయకపోతే, యెహోవాయే మాకు వ్యతిరేకంగా నిజమైన, నమ్మకమైన సాక్షిగా ఉండును గాక. అది మాకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా మేము నిన్ను పంపుతున్న మా దేవుడైన యెహోవాకు లోబడతాము. మా దేవుడైన యెహోవాకు లోబడితే మాకు మంచే జరుగుతుంది.” పది రోజుల తర్వాత యిర్మీయాకు యెహోవా వాక్కు వచ్చింది. కాబట్టి అతడు కారేహ కుమారుడైన యోహానానును, అతనితో ఉన్న సైన్య అధికారులందరినీ, సామాన్యుల నుండి గొప్పవారి వరకు ప్రజలందరినీ పిలిచాడు. అతడు వారితో, “మీ విన్నపాన్ని తెలియజేయడానికి మీరు ఎవరి దగ్గరకు నన్ను పంపించారో ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: ‘మీరు ఈ దేశంలోనే ఉంటే, నేను మిమ్మల్ని కడతాను, కూల్చివేయను; నేను మిమ్మల్ని నాటుతాను, పెరికివేయను, ఎందుకంటే నేను మీకు కలిగించిన విపత్తు గురించి బాధపడ్డాను. ఇప్పుడు మీరు ఎవరికైతే భయపడుతున్నారో ఆ బబులోను రాజుకు మీరు భయపడవద్దు. అతనికి భయపడవద్దు, అని యెహోవా ప్రకటిస్తున్నారు, ఎందుకంటే నేను మీతో ఉన్నాను, మిమ్మల్ని రక్షిస్తాను అతని చేతుల నుండి మిమ్మల్ని విడిపిస్తాను. నేను మీమీద కనికరం చూపిస్తాను, అప్పుడు అతడు మీమీద కనికరం చూపి, మిమ్మల్ని మీ దేశానికి తిరిగి పంపుతాడు.’