న్యాయాధిపతులు 9:1-21

న్యాయాధిపతులు 9:1-21 TSA

యెరుబ్-బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములో ఉన్న తన తల్లి సోదరుల దగ్గరకు వెళ్లి వారితో, తన తల్లి కుటుంబీకులందరితో ఇలా అన్నాడు, “షెకెము యజమానులను అడగండి, ‘మీకు ఏది మంచిది: యెరుబ్-బయలు డెబ్బైమంది కుమారులు మిమ్మల్ని పాలించడమా లేదా ఒక్కడు పాలించడమా?’ అని అడగండి. నన్ను గుర్తుంచుకోండి నేను మీ సమీప రక్తసంబంధిని.” అతని తల్లి సోదరులు అతని గురించి షెకెము పౌరులకు చెప్పినప్పుడు వారు, “అతడు మా బంధువు” అని, అబీమెలెకును అనుసరించడానికి మొగ్గు చూపారు. వారు బయల్-బెరీతు క్షేత్రం నుండి డెబ్బై షెకెళ్ళ వెండితెచ్చి అబీమెలెకుకు ఇవ్వగా వాటితో అతడు అల్లరిమూకను కూలికి పెట్టుకున్నాడు, వారు అతని అనుచరులయ్యారు. అతడు ఒఫ్రాలో ఉన్న తన తండ్రి ఇంటికి వెళ్లి, తన అన్నదమ్ములైన డెబ్బైమంది యెరుబ్-బయలు కుమారులను ఒకే బండ మీద చంపాడు. అయితే యెరుబ్-బయలు చిన్న కుమారుడైన యోతాము తప్పించుకుని దాక్కున్నాడు. తర్వాత షెకెము, బేత్-మిల్లో పౌరులందరూ కలిసివచ్చి షెకెములో స్తంభం ఉన్న మస్తకిచెట్టు క్రింద అబీమెలెకును రాజుగా నియమించారు. అది యోతాముకు తెలిసినప్పుడు అతడు గెరిజీము పర్వత శిఖరం ఎక్కి బిగ్గరగా వారితో ఇలా అన్నాడు, “షెకెము పౌరులారా, మీరు చెప్పేది దేవుడు వినాలంటే, నేను చెప్పేది మీరు వినాలి. ఒక రోజు చెట్లన్నీ తమకు ఒక రాజును అభిషేకించుకోవాలని బయలుదేరి వెళ్లి ఒలీవ చెట్టుతో, ‘మాకు రాజుగా ఉండు’ అన్నాయి. “అయితే ఒలీవచెట్టు, ‘చెట్లపై రాజుగా ఉండి అటు ఇటూ ఊగడం కోసం దేవుడిని మానవులను గౌరవించడానికి వాడే నా తైలాన్ని నేను వదిలేయాలా?’ అన్నది. “తర్వాత చెట్లు అంజూర చెట్టుతో, ‘రా, మాకు రాజుగా ఉండు’ అన్నాయి. “అయితే అంజూర చెట్టు, ‘చెట్లపై రాజుగా ఉండి అటు ఇటూ ఊగడం కోసం మధురుమైన నా మంచి ఫలాలను వదిలేయాలా?’ అన్నది. “తర్వాత చెట్లు ద్రాక్షవల్లితో అన్నాయి, ‘రా, మా రాజుగా ఉండు.’ “అయితే ద్రాక్షవల్లి, ‘చెట్లపై రాజుగా ఉండి అటు ఇటూ ఊగడం కోసం దేవునికి మనుష్యులకు సంతోషాన్ని ఇచ్చే నా ద్రాక్షరసాన్ని ఇవ్వడం మానివేయాలా?’ అన్నది. “చివరికి చెట్లన్నీ ముళ్ళపొదతో, ‘నీవు వచ్చి మాకు రాజుగా ఉండు’ అని అడిగాయి. “ముళ్ళపొద చెట్లతో, ‘మీరు నిజంగా నన్ను మీ రాజుగా అభిషేకించాలనుకుంటే రండి, నా నీడలో ఆశ్రయం తీసుకోండి; లేదా ముళ్ళపొద నుండి అగ్ని వచ్చి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయును గాక!’ అన్నది. “అబీమెలెకును రాజుగా చేసి మీరు మర్యాదగా సరిగా వ్యవహరించారా? మీరు యెరుబ్-బయలుకు, అతని కుటుంబానికి న్యాయం చేశారా? మీరు అతని పట్ల సరియైన విధంగా వ్యవహరించారా? నా తండ్రి మీ కోసం పోరాడి మిద్యాను చేతి నుండి మిమ్మల్ని కాపాడడానికి తన ప్రాణం పణంగా పెట్టాడని జ్ఞాపకం చేసుకోండి. అయితే మీరు నా తండ్రి కుటుంబానికి విరోధంగా లేచారు. ఒకే బండ మీద అతని డెబ్బైమంది కుమారులను చంపిన అతని దాసి కుమారుడైన అబీమెలెకు మీకు బంధువు కాబట్టి షెకెము పౌరుల మీద రాజుగా నియమించారు. యెరుబ్-బయలు, అతని కుటుంబంపట్ల సత్యంగా యథార్థంగా ఉన్నారా? ఒకవేళ మీరు అలా ఉంటే, అబీమెలెకును బట్టి సంతోషించండి అతడు మిమ్మల్ని బట్టి సంతోషించును గాక! లేకపోతే, అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి మిమ్మల్ని అనగా షెకెము, బేత్-మిల్లో పౌరులను కాల్చివేయును గాక. మీ నుండి అనగా షెకెము, బేత్-మిల్లో పౌరుల నుండి అగ్ని వచ్చి అబీమెలెకును కాల్చివేయును గాక!” తర్వాత యోతాము తన సోదరుడైన అబీమెలెకుకు భయపడి పారిపోయి బెయేర్‌కు వెళ్లి అక్కడ నివసించాడు.