యాకోబు పత్రిక 2:1-10

యాకోబు పత్రిక 2:1-10 TSA

నా సహోదరీ సహోదరులారా, మహిమగల మన ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వాసం గలవారిగా పక్షపాతం చూపకండి. బంగారు ఉంగరాలు, విలువైన బట్టలు వేసుకున్న ధనవంతుడు, అలాగే మురికిబట్టలు వేసుకున్న పేదవాడు మీ సంఘానికి వచ్చినప్పుడు, విలువైన బట్టలు వేసుకున్న ధనవంతుడిని ప్రత్యేకంగా గమనించి, “దయచేసి ఇక్కడ కూర్చోండి” అని చెప్పి, పేదవానితో “అక్కడ నిలబడు” అని “నా కాళ్ల దగ్గర కూర్చో” అని చెబితే, మీరు వ్యత్యాసాలు చూపిస్తూ దుర్మార్గపు ఆలోచనలతో విమర్శించినవారు అవుతారు కదా? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వినండి. దేవుడు తనను ప్రేమించినవారికి వాగ్దానం చేసిన ప్రకారం విశ్వాసంలో ధనవంతులుగా ఉండడానికి, తన రాజ్యానికి వారసులుగా ఉండడానికి ఈ లోకంలో పేదవారిని దేవుడు ఎంచుకోలేదా? అయితే మీరు పేదవారిని అవమానించారు. మీకు అన్యాయం చేసింది ధనవంతులు కాదా? మిమ్మల్ని న్యాయస్థానానికి లాగింది వారు కాదా? మిమ్మల్ని పిలిచిన దేవుని ఘనమైన నామాన్ని దూషించింది వాళ్ళు కాదా? “మీలా మీ పొరుగువారిని ప్రేమించాలి” అని లేఖనాల్లో వ్రాసి ఉన్న ప్రాముఖ్యమైన ఆజ్ఞను మీ ప్రవర్తన సరిగా ఉన్నట్లే. అయితే మీరు పక్షపాతం చూపిస్తే ధర్మశాస్త్రాన్ని బట్టి మీరు అపరాధులుగా నిర్ధారించబడి పాపం చేసినవారవుతారు. ఎవరైనా ధర్మశాస్త్రంలోని అన్ని ఆజ్ఞలను పాటించి ఒకే ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినప్పటికి వారు అన్ని ఆజ్ఞల విషయంలో అపరాధులు అవుతారు.