‘ఇప్పుడున్న మందిర వైభవం గత మందిర వైభవం కన్నా అధికంగా ఉంటుంది’ అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు. అంతేకాదు ఆయన ఇంకా మాట్లాడుతూ, ‘ఈ స్థలంలో నేను సమాధానాన్ని అనుగ్రహిస్తాను’ అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.” రాజైన దర్యావేషు పరిపాలనలో రెండవ సంవత్సరం తొమ్మిదో నెల ఇరవై నాల్గవ రోజున యెహోవా వాక్కు ప్రవక్తయైన హగ్గయి దగ్గరకు వచ్చి తెలియజేసింది ఏంటంటే: “సైన్యాల యెహోవా చెబుతున్న మాట ఇదే: ధర్మశాస్త్రం గురించి యాజకులను అడుగు: ఎవరైనా తమ వస్త్రపు చెంగులో ప్రతిష్ఠితమైన మాంసాన్ని తీసుకెళ్లి, ఆ చెంగుతో రొట్టెను గాని వంటకాన్ని గాని, ద్రాక్షరసాన్ని గాని, నూనెను గాని ఇతర ఏ ఆహారాన్ని గాని తాకితే అది పవిత్రం అవుతుందా?” అని అడిగితే, యాజకులు, “కాదు” అన్నారు. అప్పుడు హగ్గయి, “ఎవరైనా శవాన్ని తాకి అపవిత్రుడై ఆ వస్తువులలో ఒకదాన్ని తాకితే అతడు తాకింది అపవిత్రం అవుతుందా?” అని అడిగితే, యాజకులు, “అవును, అది అపవిత్రం అవుతుంది” అని జవాబిచ్చారు. అందుకు హగ్గయి వారితో ఇలా అన్నాడు, “ఈ ప్రజలు, ఈ జనాలు నా దృష్టికి అలాగే ఉన్నారు. వారు చేసే క్రియలన్నీ అక్కడ వారు అర్పించేదంతా నా దృష్టికి అపవిత్రమే! ఇదే యెహోవా వాక్కు. “ ‘ఆ రోజు నుండి మీరు దీని గురించి బాగా ఆలోచించండి. యెహోవా మందిరంలో రాయి మీద రాయి ఉంచే ముందు మీ పరిస్థితులను గురించి ఆలోచించండి. ఒకడు ఇరవై కుప్పల ధాన్యం నాటగా పది కుప్పల ధాన్యమే వస్తుంది. ద్రాక్షగానుగ తొట్టిలో నుండి యాభై కొలతల ద్రాక్షరసం తీయడానికి వెళ్తే ఇరవై కొలతలు మాత్రమే ఉంటుంది. నేను నీ చేతి పనంతటిని తెగులుతో బూజుతో వడగండ్లతో నాశనం చేశాను. అయినా మీరు నా వైపు తిరుగలేదు’ అని యెహోవా ప్రకటిస్తున్నారు. ‘మీరు బాగా ఆలోచించండి. ఈ రోజు నుండి, తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ రోజు నుండి, అంటే యెహోవా ఆలయ పునాది వేయబడిన రోజు నుండి జరిగిన వాటిని గురించి జాగ్రత్తగా ఆలోచించండి: గిడ్డంగిలో ధాన్యమేమైనా మిగిలి ఉందా? ఇప్పటివరకు ద్రాక్షతీగె గాని అంజూరపు చెట్టు గాని దానిమ్మ చెట్టు గాని ఒలీవచెట్టు గాని ఫలించలేదు గదా! “ ‘అయితే ఈ రోజు నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను.’ ” అదే నెల ఇరవై నాల్గవ రోజున యెహోవా వాక్కు ప్రవక్తయైన హగ్గయి దగ్గరకు రెండవసారి వచ్చి తెలియజేసింది ఏంటంటే: యూదాదేశపు అధికారియైన జెరుబ్బాబెలుతో ఇలా చెప్పు, నేను ఆకాశాన్ని భూమిని కదిలించబోతున్నాను. నేను రాజ సింహాసనాలను కూలదోసి ఇతర రాజ్యాల అధికారాన్ని నాశనం చేస్తాను. నేను రథాలను రథసారథులను కూలదోస్తాను; గుర్రాలు గుర్రపురౌతులు ఒకరి ఖడ్గం చేత ఒకరు కూలిపోతారు. “ ‘అయితే షయల్తీయేలు కుమారుడవైన జెరుబ్బాబెలూ, నీవు నా సేవకుడవు. నేను నిన్ను ఎన్నుకున్నాను. కాబట్టి ఆ రోజున నేను నిన్ను తీసుకుని నా ముద్ర ఉంగరంలా చేస్తాను, ఎందుకంటే నేను నిన్ను ఏర్పరచుకున్నాను’ ఇదే సైన్యాల యెహోవా వాక్కు.”
చదువండి హగ్గయి 2
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: హగ్గయి 2:9-23
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు